రాజ్యాంగ పదవిలో ఉన్నారు.. రాజకీయం చేయొద్దు

22 Mar, 2020 04:58 IST|Sakshi

కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం బాధ్యతారాహిత్యం

ఎన్నికల వాయిదాకు ముందు, తర్వాత రాష్ట్ర అధికారులను ఎందుకు సంప్రదించలేదు?

సుప్రీంకోర్టులో కేవియట్‌ ఎందుకు వేశారు? వ్యక్తిగత తగాదాలున్నాయా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌పై ఆర్థిక మంత్రి బుగ్గన ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికల విషయంలో రాజకీయం చేయడం తగదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అధికారాలే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఆయన విస్మరించకూడదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు. మంత్రి ఏమన్నారంటే.. 
ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను వాయిదా వేసే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), ఆరోగ్య శాఖ అధికారులతో కనీసం సంప్రదించలేదు. పద్ధతి ప్రకారం.. కమిషనర్‌ ఎవరితోనైనా సంప్రదించాలని నిబంధనలున్నాయి. ఇలా చేయకుండా అనధికారికంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి వాయిదా వేశానని చెప్పడం సరైన పద్ధతేనా? 
కోవిడ్‌పై ప్రభుత్వం పూర్తి జాగ్రత్తతో అన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌ ప్రమాదకరమైంది కాబట్టి ఎన్నికలు వాయిదా వేశామని సీఎస్‌కి రమేష్‌కుమార్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి నియంత్రణ చర్యలపై సీఎస్‌ను ఆయన ఎందుకు సంప్రదించలేదు?
కోవిడ్‌ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా?
ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్‌కుమార్‌ కేవియట్‌ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? 
ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలను సుప్రీంకోర్టు సమర్థించింది. 
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రమేష్‌కుమార్‌ లేఖ రాయడం బాధ్యతారాహిత్యం. ఆ లేఖ ఆసాంతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసినట్లుగా ఉంది. 
ఎక్కువ సీట్లు గెల్చుకోవాలని లేకుంటే పదవులు పోతాయని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలిచ్చినట్లుగా లేఖ రాశారు. ఎవరు చెప్పారు మీకిదంతా.. మీరేమైనా సాక్షులా? ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేశారు? 
అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం స్థానాలు గెల్చుకున్నాం కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెల్చుకోవాలని 
సీఎం సాధారణంగా అంటారు. దాన్ని రాద్ధాంతం చేస్తారా? చంద్రబాబు తన కార్యకర్తల సమావేశాల్లో నూటికి నూరు శాతం మనమే గెలవాలి అని అనడం లేదా? 
అలాగే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే అనర్హతకు గురవుతారనే ఆర్డినెన్స్‌ను రమేష్‌కుమార్‌ తన లేఖలో తప్పుపట్టడం గర్హనీయం.

జ్వరం వస్తే పారాసెటిమాల్‌ వాడరా?
ఎల్లో మీడియాకు మంత్రి బుగ్గన సూటి ప్రశ్న
‘జ్వరం వస్తే పారాసెటిమాల్‌ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్‌ ఉందని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్‌పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని దుయ్యబట్టారు.  

మరిన్ని వార్తలు