కేసీఆర్‌ పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారు

31 Jul, 2019 04:05 IST|Sakshi

ప్రతిపక్ష సభ్యులపై ఆర్థిక మంత్రి బుగ్గన చురక  

సాక్షి, అమరావతి: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేరు ఎత్తితేనే టీడీపీ సభ్యులు ఎందుకో భయపడి పోతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చురక అంటించారు. 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీతో ఆరంభమైన 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2.32 లక్షల కోట్లతో ద్రవ్య వినిమయ బిల్లును మంగళవారం శాసన మండలిలో మంత్రి ప్రతిపాదించారు. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు బుగ్గన సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల భావితరాల ప్రయోజనాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలనే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చలు జరిపారన్నారు. తెలంగాణ భూ భాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మనకు వస్తాయా అనే రీతిలో టీడీపీ సభ్యులు అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అసలు కేసీఆర్‌ పేరు ఎత్తితేనే టీడీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.

టీడీపీ హయాంలో నీరు–చెట్టు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం... ఇలా ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందని,  వాటన్నిటిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో రోడ్ల నిర్మాణాలు కేవలం మూడు కంపెనీలకే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014 నుండి 2016 వరకు పోలవరంప్రాజెక్టు మాటే ఎత్తలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఒప్పందం కుదిరే వరకు వాటి గురించి పట్టించుకోక పోవడానికి కారణాలు ప్రజలందరికీ తెలుసునన్నారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులైనా గడవకముందే పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం బడెŠజ్‌ట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించి రూ.1700 కోట్లతో కాలువలు తవ్వారు. అవే లేకపోతే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా ఇచ్చేవారని  మంత్రి ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు