అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

27 Jul, 2019 05:10 IST|Sakshi

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టీకరణ 

టీడీపీ పాలనలో ప్రజాధనం విచ్చలవిడిగా దోచుకున్నారు 

అక్రమార్జన కోసం చట్టాల్లో మార్పులు చేశారు 

అలాంటి పరిస్థితికి చరమ గీతం పాడుతున్నాం 

సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచిపెట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇకపై అలాంటి పరిస్థితికి తావు లేకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు–2019ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బుగ్గన మాట్లాడారు. బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎనేబిలింగ్‌ యాక్ట్‌ (ఏపీఐడీఏ)ను గత టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణగా అమరావతి ప్రాంతంలో చేపట్టిన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తెలియజేశారు. సభలో బుగ్గన ఏం మాట్లాడారంటే.. 

‘‘స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలో 1,691 ఎకరాల్లో బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ను కట్టేందుకు ఎవరో బయటి వాళ్లను తేవాలన్నది ఆనాటి టీడీపీ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా చట్టంలో ఏవో మార్పులు తీసుకువచ్చారు. అక్కడేదో అద్భుత నగరం నిర్మిస్తున్నారన్న భ్రమ కల్పించారు. వాస్తవానికి వాళ్లు అక్కడ చేసింది కేవలం ప్లాట్ల వ్యాపారమే. 1,691 ఎకరాలను అభివృద్ధి చేసే పేరిట తొలుత స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతికి పోయారు. ఇదేమిటంటే ముందు ఎవరైతే వచ్చి ఫలానా ధరకు ఫలానా పని చేస్తాను, చేయగలను అని చెప్పడం. ఇదో వినూత్నమైందని చెప్పి దాని విధివిధానాలు చెప్పాలి. అయితే ఇందులో స్థానికులు పాల్గొనకుండా చట్టాన్ని సవరించి ఏవేవో నిబంధనలు పెట్టారు. ఎవరైనా పాల్గొనవచ్చు అనే దాన్ని తీసివేసి చట్టాన్ని మార్చివేశారు. ప్రభుత్వమే అంటే క్యాబినెట్‌ చెప్పినట్టు చేసేలా అనేక మార్పులు చేశారు. ఇటువంటి మార్పులు జరక్కుండా ఉండేందుకే ఈ ముందస్తు న్యాయ సమీక్షను తీసుకువస్తున్నాం. గత ప్రభుత్వం తనకు నచ్చిన విదేశీ వాళ్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చేలా ఏపీఐడీఏ చట్టంలో అనేక మార్పులు తెచ్చుకున్నారు. దీనిపై జస్టిస్‌ రామచంద్రరావు తాత్కాలిక స్టే ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ప్లాట్ల వ్యాపారం చేయడానికి తాము పనికిరామా? అని స్థానికులు కోర్టుకు పోతే ఆ న్యాయమూర్తి ఈ స్టే ఇచ్చారు. మన రాష్ట్రంలో జరిగే ఈ పనులు స్వదేశీ వాళ్లమైన తమకు దక్కకుండా విదేశీయులకు దక్కేలా వారికి అనుకూలమైన నిబంధనలు ఎలా పెడతారని స్థానిక కాంట్రాక్టర్లు ప్రశ్నించారు. రూ.6.35 కోట్ల డిపాజిట్‌ అని, రూ.2,000 కోట్ల ఆస్తులుండాలని ఇలా ఏవేవో నిబంధనలు పెట్టడంతో పాటు సింగపూర్‌ కంపెనీలకు మేలు చేయాలనే ఉద్దేశంతో 7 రోజులే గడువు ఇవ్వడం వంటివి గత ప్రభుత్వం చేసినప్పుడు జస్టిస్‌ రామచంద్రరావు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం చేసింది తప్పని చెబుతూ న్యాయమూర్తి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా నిజాయితీగా ఉండాలని, పద్ధతిగా ఉండాలని, పక్షపాతం లేకుండా ఉండాలని, నా వాళ్లు అనే పక్షపాతం లేకుండా ఉండాలని తన స్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాని ప్రకారమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం.  

బాబు పాలనలో ఐకానిక్‌ కరప్షన్‌ 
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐకానిక్‌ అనే పదం ఒకటి కనిపెట్టారు. అదేమంటే ఐకానిక్‌ బిల్డింగ్, ఐకానిక్‌ బ్రిడ్జ్‌ అంటారు. కానీ, వాస్తవానికి వాళ్ల హయాంలో జరిగింది ఐకానిక్‌ అవినీతి. చివరకు వీళ్లు చేసిందేమిటంటే అన్నింటా దోపిడీకి పాల్పడడమే. స్విస్‌ చాలెంజ్‌ కూడా ఆకోవలోదే. అటువంటి దోపిడీ జరక్కూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బిల్లును తీసుకువచ్చారు. టీడీపీ వాళ్ల దోపిడీ తీరు ఎలాంటిదో ఇంకో ఉదాహరణ చెబుతా. అసెండాస్, సింగ్‌బ్రిడ్జ్, జురాన్‌ అనే కంపెనీలు కలిసి ఏర్పడిన సింగపూర్‌ కన్సార్షియంను రాష్ట్రంలోకి తీసుకువస్తుందట. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ఒక భాగమట, సింగపూర్‌ ఒక భాగమట. వీళ్ల తీరు ఎలా ఉంటుందంటే.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రూ.221 కోట్లు, సింగపూర్‌ వాళ్లేమో రూ.306 కోట్లు పెట్టుబడి పెడతారట. ఆ తర్వాత అప్పు మొత్తం ఆంధ్రప్రదేశే చెల్లించాలి. మౌలిక వసతుల కోసం రూ.5,500 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాలి. భూమి విలువ కూడా ఇవ్వాలట. అంటే మొత్తం లెక్కవేస్తే రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే పెట్టుబడిగా పెట్టాలి. సింగపూర్‌ వాళ్ల పెట్టుబడి కేవలం రూ.306 కోట్లట! వాళ్లు ఒక్క రూపాయి అప్పుతేరట. తెచ్చే అప్పునకు ఆంధ్రప్రదేశే పూచీకత్తుగా ఉండాలట. రోడ్లు, కాలువలు, కరెంటు, నీళ్లు అన్ని ఉచితంగా ఇవ్వాలట. 

ఇలా ఎన్ని కండిషన్లు పెట్టుకున్నారో.. ఇంతా చేసిన తర్వాతైనా ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా మేలు జరుగుతుందా? అంటే అదీ లేదు. అభివృద్ధి చేసిన తరువాత వచ్చేది ఆంధ్రప్రదేశ్‌కు 42 శాతమట, సింగపూర్‌కు 58 శాతమట. ఇలా ఎక్కడైనా ఉంటుందా? రూ.306 కోట్ల పెట్టుబడి పెట్టిన సింగపూర్‌ కంపెనీలకేమో 58 శాతం, రూ.12 వేల కోట్ల పెట్టుబడి పెట్టిన వారికేమో 42 శాతమట. అంతటితో ఆగకుండా మేనేజ్‌మెంట్‌ కంపెనీ అని ఇంకో దాన్ని పెట్టారు. దాని ద్వారా కూడా కాకుండా ఇంకో సంస్థను పెట్టి వాళ్ల ద్వారా అమ్మకాలు చేసి కమీషన్‌ తీసుకుంటారట. అందుకే ఇటువంటి దోపిడీని అరికట్టి పారదర్శకతతో టెండర్లు పిలిచి, అవినీతి నిర్మూలించేందుకు ముందస్తు న్యాయ పరిశీలన బిల్లును తీసుకొచ్చాం.. 

సభ నుంచి బాబు పారిపోయారు: భూమన
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ.. దేశంలో ఏ సీఎం చేయనటువంటి సాహసాన్ని తమ సీఎం వైఎస్‌ జగన్‌ చేశారన్నారు. సభలో ఉంటే సిగ్గుతో చచ్చి పోవాల్సి వస్తుందనే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. 45 ప్రాజెక్టులకు రూ.17,500 కోట్లు సరిపోతాయన్న పెద్దమనిషి.. రూ.63 వేల కోట్లకు అంచనాలు పెంచి వెచ్చించారని వివరించారు. అవినీతిని పారదోలడానికి సీఎం జగన్‌ ఒక యజ్ఞం, రాజసూయయాగం చేయబోతున్నారన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. 25 విభాగాల్లో జరిగే పనుల్లో ఈ ముందస్తు జ్యుడిషియల్‌ రివ్యూ వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదన్నారు. చంద్రబాబు అవినీతి వల్లే ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు వెనక్కిపోయాయన్నారు.

ఇది మంచి పరిణామం: అంబటి
పారదర్శకతకు ఇదో మంచి పరిణామమని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.  చంద్రబాబు తన అనుయాయులైన సీఎం రమేష్, పుట్టా సుధాకర్‌యాదవ్‌ వంటి వారి కంపెనీలకు పనులను దోచిపెట్టి వందల కోట్ల రూపాయల కమీషన్లు పొందారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఒక ప్రాజెక్టు అంచనాలు పెంచితే అభ్యంతరం తెలిపి అడ్డగించిన చంద్రబాబు.. అదే పనికి 20 శాతం పెంచుతూ జీవో తీసుకువచ్చి దోచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్న చంద్రబాబు.. ఆ మేరకు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎక్కడ పెరిగిందో చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. 

ఈ బిల్లు దేశానికే ఆదర్శం : అమర్‌నాథ్‌
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. పారదర్శకత లోపించినప్పుడు అభద్రత పెరుగుతుందన్న దలైలామా సూక్తిని ప్రస్తావిస్తూ, చంద్రబాబు హయాంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వివరించారు. చంద్రబాబు సభ నుంచి పారిపోయారన్నారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్‌వన్‌గా మార్చారన్నారు. ఈ బిల్లు దేశానికే ఆదర్శంగా ఉంటుందని అమర్‌నాథ్‌  అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు