ఖర్చే లేనప్పుడు అప్పులెందుకు బాబూ?

30 Sep, 2018 12:32 IST|Sakshi

బాబు అమెరికా టూర్‌పై  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని చంద్రబాబు దొంగ ప్రచారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాల్లొన్నది యూఎన్‌వోలో కాదనీ, ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మీటింగ్‌లో అని తెలిపారు. సస్టెయినబుల్‌ ఇండియా ఫైనాన్స్‌ ఫెసిలిటీ (ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌‌) పెట్టిన పరిశోధన కేంద్రం గుంటూరులోని గోరంట్లలో ఉందని అన్నారు. ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌లో ప్రపంచానికి తానే ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు అసత్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఖర్చు లేదన్నప్పుడు అప్పులెందుకు?
న్యూయార్క్‌ టైమ్స్‌కి ప్రృకృతి వ్యవసాయానికి 1400 కోట్లు కేటాయించామనీ, ఇంకా 16 వేల 600 కోట్ల రూపాయలు అప్పు కావాలని గతంలో చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రజలను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుల కోసమే బాబు అమెరికా వెళ్లారనీ, అప్పుల కోసమే ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌తో చేతులు కలిపారని  ఆరోపించారు. అసలు ప్రకతి సేద్యం ఆచరణ సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ప్రకృతి సేద్యానికి పెట్టుబడే అవసరం లేదని ఓవైపు.. వేల కోట్ల రుణాలు కావాలని మరోవైపు బాబు మాట్లాడడం ఆయన అబద్ధాల ప్రచారానికి తార్కాణమని అన్నారు.

పరువుతీసే భాష..
‘ఐయామ్‌ టెక్నాలజీ, ఐ మేక్‌ అమరావతి వరల్డ్‌ క్యాపిటల్‌’అని బాబు మాట్లాడడం సిగ్గుచేటని బుగ్గన అన్నారు. ముఖ్యమంత్రి ఇంగ్లీష్‌ ప్రావీణ్యంతో రాష్ట్రం పరువు పోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబే టెక్నాలజీ అంట.. అమరావతిని ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా చేస్తాడట.. అని బుగ్గన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి చంద్రబాబు తన ఆస్తులు పెంచుకుంటున్నాడని విమర్శించారు. ఏపీలోని ప్రతి పౌరునిపై 40 వేల రూపాయల అప్పు ఉందని అన్నారు. రాష్ట్రంలోని 70 శాతం రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల భూములను తీసుకున్న ప్రభుత్వం అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ భవనాన్నయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు