రివ్యూలు చేయరాదని చంద్రబాబుకు తెలియదా?

19 Apr, 2019 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా రివ్యూలు చేయరాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియదా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆపద్ధర్మ సీఎం అత్యవసర సమయంలో మాత్రమే రివ్యూలు చేస్తారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల పథకాల కోసం ఖజానాలోని సొమ్మును తరలించారని విమర్శించారు. హోంగార్డులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. సాధారణ పరిపాలనలో బిల్లులు కూడా పాస్‌ కావడం లేదని తెలిపారు. 

చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రూ. 1600 కోట్లతో పట్టిసీమను ఎందుకు ప్రారంభించారో సమాధానం చెప్పాలని అన్నారు. దోచుకోవడం కోసమే చంద్రబాబు పట్టిసీమను చేపట్టారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజస్వామ్య పరిరక్షించడమా అని ప్రశ్నించారు. 

ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మించకుండా చంద్రబాబు ఏం చేశారని ఎద్దేవా చేశారు. సీఆర్‌డీఏ కేటాయింపులో అవినీతి జరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా రూ. 4 కోట్లకు కేటాయిస్తే.. వాళ్లకు నచ్చిన ప్రైవేటు సంస్థలకు రూ. 40 లక్షలకే కేటాయించారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, టీడీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని వ్యాఖ్యానించారు. అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సేవామిత్ర పేరుతో టీడీపీ నాయకులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారని గుర్తుచేశారు. ఈవీఎంల కేసులో నిందితుడు హరిప్రసాద్‌ను ఎన్నికల సంఘం  దగ్గరకు తీసుకెళ్తారా అని నిలదీశారు.  గెలుస్తామని చెబుతున్న చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు