గత ప్రభుత్వ వైఫల్యం వల్లే : బుగ్గన

23 Oct, 2019 14:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం అతి దరిద్రమైన ఆర్థిక పరిస్థితిని వారసత్వంగా ఇచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ డిస్కంలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా.... బాకీలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. చెప్పినదాని కంటే ముందుగానే తమ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులకు సున్నావడ్డీ రుణాలు, ఇన్యూరెన్స్‌ ఇస్తున్నామని వెల్లడించారు. మద్యం షాపులు తగ్గించామని తెలిపారు. సీఎం జగన్‌ హామీలన్నీ నెరవేరుస్తుంటే చంద్రబాబు ఓర్వలేక తన ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చంద్రబాబు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.

‘గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేసి.. వాటిని మాపై నెట్టి విమర్శిస్తున్నారు. విద్యుత్‌ డిస్కంలను నష్టాల్లోకి నెట్టారు. విద్యుత్‌ను అధిక ధరకు కొన్నామని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక నుంచి థర్మల్ విద్యుత్ కొనుగోలు కోసం 2018 అక్టోబర్‌లో ఒప్పందం చేసుకున్నది టీడీపీ ప్రభుత్వమే. సౌర, పవన విద్యుత్‌లు అన్ని సమయాల్లో రావని టీడీపీ నేతలకు తెలియదా’ అని బుగ్గన ప్రశ్నించారు. అదే విధంగా ఇసుక సమస్యకు చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడే కారణమని విమర్శించారు. ప్రస్తుతం వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు, యనమల, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. 

‘ఇండియా ఇండెక్స్ సర్వేలో రాష్ట్రాల పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. కొత్తదనం, వినూత్న ఆవిష్కార పరిస్థితులపై సర్వే చేశారు. ఇలా మొదటి సారి ర్యాంక్ ఇచ్చినప్పుడు ఇక పడిపోవడం అనే విషయం ఎక్కడుంటుంది. మన రాష్ట్రంలో ఉన్న పరిజ్ఞానం అమలు చేసే విధానం లో వెనుకబడి ఉన్నామని చెప్పారు. పరిశ్రమకు మారే విషయంలో వెనుకబడ్డామని పేర్కొన్నారు. అసలు ఈ పరిస్థితికి చంద్రబాబు పాలన కారణం కాదా..?’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీలలో మౌలిక వసతుల కల్పన 3 నెలల్లో పూర్తవుతుందా..? ఇన్నాళ్లు లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పారు. అదే నిజమైతే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? నిజానికి హైద్రాబాద్ లాంటి నగరం వలన తెలంగాణ మనకంటే ముందుంది. ఇక ఎస్‌డీజీ సూచీలో ఆకలి లేకుండా ఉండాలన్న లక్ష్యంలో మనం 17వ స్థానంలో ఉన్నాం. ఆ లక్ష్యంలో ముందుండాలన్న లక్ష్యంతోనే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. నీటి సరఫరా, పారిశుద్ధ్యంలో 16 వ స్థానంలో ఉన్నాం. అందుకే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. ఇక ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌లో దేశంలో మనం 20 వ ర్యాంకులో ఉన్నాం. అందుకే క్లస్టర్ల ద్వారా పారిశ్రామిక వృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు