అప్పుడు ‘సాక్షి’పై కేసులు ఎందుకు పెట్టారు?

13 Dec, 2019 07:23 IST|Sakshi

అసెంబ్లీలో ప్రశ్నించిన బుగ్గన రాజేంద్రనాథ్‌

అప్పట్లో సాక్షికిచ్చిన నోటీసుల వివరాలు వెల్లడించిన మంత్రి  

సాక్షి, అమరావతి: తప్పుడు వార్తలపై చర్య తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై విపక్షం రాద్ధాంతం సరికాదని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. గురువారం ఆయన సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ‘సాక్షి’ పత్రికపై కత్తిగట్టి కేసులు పెట్టారని తెలిపారు. ఆ కేసుల వివరాలను ఆయన సభలో చదివి వినిపించారు.  

ఆ కేసుల వివరాలివీ.. 

  • 20–04–2018న 868 జీవో ఇచ్చారు. ‘పరిహారం మింగిన గద్దలు’ శీర్షికన ఎస్టీలకు అందాల్సిన పరిహారం ఎవరో కొట్టేశారని ‘సాక్షి’ రాసిందానికి నోటీసులిచ్చారు. 
  • 18–05–2018న 1088 జీవో ఇచ్చారు. తప్పుగా ప్రచురించారంటూ సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌కు నోటీసులిచ్చారు. 
  • 02–08–2018న 1698 జీవో ద్వారా జగతి పబ్లికేషన్స్, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటర్‌ వి.మురళికి నోటీసులు ఇచ్చారు. 
  • 08–10–2018న 2151 జీవో ద్వారా జగతి పబ్లికేషన్స్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటర్‌ వి.మురళికి నోటీసులు జారీ చేశారు.  
  • 28–03–2019న 733 జీవో ద్వారా జగతి పబ్లికేషన్స్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటర్‌ వి.మురళికి నోటీసులిచ్చారు. 

ఇప్పుడెందుకు గొడవ? 
అప్పట్లో ఇన్ని జీవోలిచ్చి సాక్షిపై కక్ష సాధింపునకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు అవాస్తవ వార్తలపై చర్యలు తీసుకుంటామంటే రాద్ధాంతం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. సింగపూర్‌ కంపెనీలు ఇక్కడ పెట్టిన బిలియన్‌ డాలర్లు వృథా అయ్యాయని కొన్ని పేపర్లు వార్త రాశాయన్నారు. మనం చెడిపోయేదే కాక పక్క దేశాలను కూడా చెడగొడుతున్నారని తప్పుపట్టారు. ముఖ్యమైన బిల్లులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు