అక్కడి సేల్స్‌.. జనం పల్స్‌ చెబుతాయి!

7 Apr, 2019 10:51 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ : కోల్‌కతాలో అతి పెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ బుర్రా బజార్‌. అక్కడ అడుగుపెడితే.. ఎలక్షన్‌ ఫీవరే కాదు, జనం నాడిని కూడా పట్టుకోవచ్చు. ఈ మార్కెట్‌లో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఎన్నికల సామగ్రి ఎక్కువగా అమ్ముడుపోతుంది. జాతీయ జెండాలు, టీ షర్ట్‌లు, చీరలు, స్టోన్స్, గొడుగులు, బ్యాడ్జెట్స్, రిస్ట్‌ బ్యాండ్స్, బెలూన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాటి మీద మోదీ ఫొటోలు, లేదంటే ఆకట్టుకునే బీజేపీ ఎన్నికల నినాదాలు కనిపిస్తాయి.

ఇక టీఎంసీ ఎన్నికల గుర్తు గడ్డి, రెండు పువ్వులు, ఆ పార్టీ ఎన్నికల నినాదాలు ముద్రించి ఉన్న వస్తువులకీ డిమాండ్‌ ఎక్కువుంది. గత రెండు నెలల అమ్మకాలు పరిశీలిస్తే టీఎంసీకి చెందినవి 10 వేల వస్తువులు అమ్ముడుపోతే, బీజేపీవి 2,500 అమ్ముడయ్యాయి. ‘కోల్‌కతాలో అతి పెద్ద మార్కెట్‌ ఇదే. బెంగాల్‌ నలుమూలల నుంచి ఎన్నికల సమయంలో పార్టీ మద్దతుదారులు వచ్చి రకరకాల వస్తువులు కొంటుంటారు.

50 ఏళ్లుగా నా దుకాణం ఇక్కడే ఉంది. తృణమూల్‌ పార్టీ వస్తువులకే డిమాండ్‌ ఎక్కువ. టీఎంసీ, బీజేపీ అమ్మకాలు 4ః1 నిష్పత్తిలో ఉంటాయి’ అని గంభీర్‌ అనే దుకాణదారుడు వివరించారు. ఈ అమ్మకాలే ఓ రకంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సరళిని కూడా తెలుపుతోందని ఆయన అన్నారు. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీల వారీగా సామగ్రిని అమ్మకానికి పెడతాం.

మొత్తమ్మీద అమ్మకాల ఆధారంగా జనం మూడ్‌ని పసిగట్టగలం’ అని మరో దుకాణదారుడు కిషన్‌ దాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మార్కెట్‌లో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్‌ నుంచి వచ్చిన వ్యాపారులే ఎక్కువున్నారు. కానీ ఈ మార్కెట్‌పై మమత పట్టు కొనసాగుతోంది. రాహుల్‌ టీ షర్టుల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు