బుట్టా.. పయనమెట్టా?!

2 Nov, 2018 13:14 IST|Sakshi

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు వ్యవహారం

బుట్టా రేణుకకు ఎంపీ సీటు హుళక్కే!

మండిపడుతున్న వర్గీయులు

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని ప్రచారం

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు రాజకీయం కాస్తా జిల్లాలో నేతల బుర్రలను హీటెక్కిస్తోంది. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మళ్లీ ఎంపీగానే బరిలో ఉండాలని కలలు కంటున్న సిట్టింగ్‌ ఎంపీ బుట్టా రేణుకకు సీటు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అప్పుడామె పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. 

సీటు రాకుండా చేసే యత్నాలు
కర్నూలు నగర పాలక సంస్థలో జరుగుతున్న పనుల విషయంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో బుట్టా రేణుక ఢీ కొంటున్నారు. తనకు కనీసం ప్రొటోకాల్‌ పాటించడం లేదని బహిరంగంగానే మండిపడిన బుట్టా రేణుక.. కార్పొరేషన్‌లోఅవినీతి వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. వాటిపై విచారణ జరపాలంటూ ఏకంగా విజిలెన్స్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ  ప్రారంభించారు. కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు కూడా ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుట్టా వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా మండిపడుతున్నారు. వీరు ఏకంగా ఆమెకు సీటు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఉంటారని ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేస్తోంది. అయితే..అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా లేరు. అయినప్పటికీ బుట్టాకు ఎంపీ సీటు రాదని, ఎమ్మెల్యేగానే బరిలో ఉంటారని ఎస్వీ వర్గం భారీఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం కూడా ఇరు వర్గాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. 

ఇప్పుడేమంటారో!
వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తును టీడీపీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారు ఒక అడుగు ముందుకేసి.. కాంగ్రెస్‌ దరిద్రం తమకెందుకని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే డోన్‌ అసెంబ్లీ సీటును తాము వదులుకోవాల్సి వస్తుందనే భావనలో కేఈ వర్గం ఉంది. అంతేకాకుండా మొదటి నుంచి ఇరు వర్గాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే పైస్థాయిలో అంగీకరించినప్పటికీ కింది స్థాయి కేడర్‌ మాత్రం మండిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తును కాంగ్రెస్‌ పార్టీలోని నేతలు కూడా అంగీకరించడం లేదు. ఇదిలా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీని కలవడంతో పాటు ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని ప్రకటించారు. టీడీపీతో పొత్తు  కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మున్ముందు కూడా కొనసాగుతుందని వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. అంటే రానున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోంది. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ,  కోట్ల ఏమంటారో వేచిచూడాల్సిందే! 

మరిన్ని వార్తలు