బీజేపీని ఓడించడమే మా లక్ష్యం: రాఘవులు

16 Apr, 2018 01:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీని ఓడించడమే తమ పార్టీ ప్రథమ లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మత ప్రాతిపదికన జరిగే రాజకీయాలకు సీపీఎం వ్యతిరేకమని.. వ్యక్తి స్వేచ్ఛను హరించేలా కేంద్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర నేతలు బి.వెంకట్, టి.సాగర్, రమలతో కలసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలను దెబ్బతీయాలనే ఆలోచనతోనే బీజేపీ ముందుకెళ్తోందని ఆరోపించారు.

ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో పార్టీ నిర్మాణంతో పాటు రాజకీయ విధివిధానాలపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. జాతీయ మహాసభల ప్రాంగణానికి మహ్మద్‌ అమీన్‌నగర్‌గా, సభా వేదికకు కగేమ్‌ దాస్, సుకుమెల్‌ సేన్‌ల పేర్లు పెట్టామని చెప్పారు. 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్‌ నేత మల్లు స్వరాజ్యం పార్టీ జెండావిష్కరణతో ప్రారంభ సభ మొదలవుతుందన్నారు.

దీనికి ఐదు వామపక్షాల జాతీయ నేతలు హాజరవుతారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, 8 మంది సీనియర్‌ నేతలు మొత్తం 846 మంది హాజరవుతారన్నారు. మూడ్రోజుల పాటు 25 ముఖ్యమైన తీర్మానాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. 22న సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని రాఘవులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు