పదేళ్లకు కూడా అమరావతి అభివృద్ధి చెందదు..

12 Jun, 2018 03:00 IST|Sakshi
విలేకర్లతో మాట్లాడుతున్న బీవీ రాఘవులు, వేదికపై రమాదేవి, సుబ్రహ్మణ్యం

     ఉమ్మడి ఏపీని నాశనం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిపైనా పడ్డారు

     సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజం  

తెనాలి: చంద్రబాబు తీరు వల్ల వచ్చే పదేళ్లకు కూడా రాజధాని అమరావతి అభివృద్ధి చెందదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిపై పడ్డారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల కార్యాలయాన్ని సోమవారం బీవీ రాఘవులు ప్రారంభించారు.

అనంతరం సీపీఎం తెనాలి డివిజన్‌ కన్వీనర్‌ ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరిగినప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. లేకుంటే ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు.

రాష్ట్ర పాలకుల శ్రద్ధ అంతా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ గురించి కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి ముందుకు సాగాలంటే ప్రత్యేకమైన నమూనా కావాలని, అది వామపక్షాలు మాత్రమే తేగలవని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న నేరాల్లో యాభై శాతం మద్యం కారణంగానే జరుగుతున్నాయని వెల్లడైనా.. మరిన్ని మద్యం, బెల్టు షాపులకు అనుమతిస్తుండటం దారుణమన్నారు.

సమావేశంలో కుమార్‌ పంప్స్‌ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి, అన్నపరెడ్డి కోటిరెడ్డి, పాశం రామారావు, నెల్లూరు ప్రజా వైద్యశాల డాక్టర్‌ పి.అజయ్‌కుమార్, డాక్టర్‌ భీమవరపు సాంబిరెడ్డి, దండ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ సింహాచలం, కంఠంనేని హనుమంతరావు, బొనిగల అగస్టీన్, ప్రధాన దాత పండా సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు