జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

27 Jul, 2019 07:54 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు  

ఫెడరల్‌ వ్యవస్థ దెబ్బతింటోంది

అధికారమంతా కేంద్రీకృతం చేసుకునే కుట్ర

కార్పొరేట్‌ శక్తుల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజం

సాక్షి, ఒంగోలు టౌన్‌: ‘దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణకై తెరపైకి వచ్చిన జమిలి విధానం ప్రజాస్వామ్యానికి హానీకరం. జమిలి ఎన్నికల కారణంగా ఫెడరల్‌ వ్యవస్థ దెబ్బతింటోంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. కార్పొరేట్‌ శక్తుల కోసం చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైందని’ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఫ్యాన్సీ గూడ్స్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో ‘జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు, కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగులు, ప్రజలపై దుష్ప్రభావాలు’ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్‌కు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్న అంశాన్ని బీజేపీ తెలివిగా తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి ట్రిప్పుకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళుతోందని, అయితే కొంతమంది ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నప్పటికీ పర్యవసానం మాత్రం ఇంకోలా ఉంటోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు ముందుకు వెళితే, దాని ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతోందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లో కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో నాలుగైదు దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయని, ఇటలీ, బ్రిటన్, స్విట్జర్లాండ్‌లో కూడా తక్కువ కాలపరిమితిలోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఆ సమయంలో ఖర్చు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. 

ఆ విధానం అత్యంత ప్రమాదకరం 
అతి చిన్న ప్రభుత్వం – అత్యంత ఎక్కువ పరిపాలన అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో చేసిన ప్రకటన అత్యంత ప్రమాదకరంగా ఉందని బీవీ రాఘవులు విమర్శించారు. అతి చిన్న ప్రభుత్వం అంటే అన్నీ చేయమని, అత్యంత ఎక్కువ పరిపాలన పేరుతో ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయబోతోందని ముందస్తు సంకేతాలు ఇచ్చిందన్నారు. ప్రజలకు అందించే సేవల నుండి తప్పుకొని ప్రైవేట్‌పరం చేయడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. విద్యారంగం, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రవాణా రంగం, చివరకు రక్షణ రంగం నుంచి తప్పుకొని ప్రైవేట్‌ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రెగ్యులేటరీ కమీషన్ల పేరుతో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుందన్నారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 7 లక్షల కోట్ల లోటు చూపించారని, దానిని భర్తీ చేసేందుకు ప్రజలపై అదనపు భారాలు మోపనుందన్నారు. ఐఎంఎఫ్‌ సంస్థ దేశంలో అభివృద్ధి పడిపోతోందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 235 సంస్థలను అమ్మివేయాలంటూ నీతి అయోగ్‌ ఇటీవల సూచించిందన్నారు. వేలాది మంది పనిచేసే సంస్థలను మూసివేస్తూ, పదిమందికి ఉపాధి కల్పించే వాటిని ఏర్పాటుచేస్తూ కేంద్రం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. పీపీపీ ద్వారా రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విధానం వల్ల చివరకు ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తూ ప్రైవేట్‌ వారికి పెత్తనం అప్పగిస్తోందన్నారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి కే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో మాదాల వెంకట్రావు, ఎన్‌ రంగారావు పాల్గొన్నారు. 

రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసింది 
ఒంగోలు టౌన్‌: రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీల అమలులో, రాజధాని నిర్మాణంలో సహకరించకపోగా, ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులకు కూడా అడ్డుపడుతోందని విమర్శించారు. శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీపై కారాలు, మిరియాలు నూరిన చంద్రబాబు, ఇప్పుడు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకువచ్చే విషయమై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని, అంతకంటే ముందుగా ఈ విషయమై అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం ధూషణ, భూషణలకే పరిమితమైందన్నారు. కీలకమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంత ఆలస్యం జరిగితే అంత బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు.
 
ఎదురు దెబ్బలు తాత్కాలికమే..
గత సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు బలం కలిగినచోట దానిని నిలుపుకోవడంలో విఫలమైనాయని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. తమకు గట్టి పట్టు ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి చెందడం వెనుక బీజేపీ, కాంగ్రెస్‌ వ్యూహాలతోపాటు తమ క్యాడర్‌ను, సానుభూతిపరులను భయభ్రాంతులకు గురిచేయడం ఓటింగ్‌పై ప్రభావం చూపాయన్నారు. తమ పార్టీకి తగిలిన ఎదురు దెబ్బలు తాత్కాలికమేనని, తిరిగి పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీవీ రాఘవులు వెంట సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఉన్నారు.

మరిన్ని వార్తలు