కేశవ్‌ను సీఎం చేయకపోవడం వల్లే..

4 Jun, 2018 16:21 IST|Sakshi
కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య(ఎడమ), యోగి ఆదిత్యనాథ్‌(కుడి)

లక్నో : వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నిర్లక్ష్యం చేయడం వల్లే ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశామని ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ పేర్కొన్నారు. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను సీఎం చేయకపోవడం వల్లే ఓబీసీలు బీజేపీని ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ముందు మౌర్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ప్రజల్లోకి వెళ్లిందని, కానీ ఫలితాల అనంతరం యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా చేసిందని అన్నారు. దాని ప్రభావమే ఉప ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. సీఎం యోగి ఆదిత్యనాథే ఉప ఎన్నికల్లో ఓటమికి కారణమని అంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రభుత్వం అందుకు కారణమని రాజ్‌భర్‌ వ్యాఖ్యానించారు.

ఓటమికి గల కారణాలపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది పార్టీ ఇష్టమని అన్నారు. కాగా, కైరానా లోక్‌సభ, నూర్‌పూర్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్లా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఆర్‌ఎల్డీకి చెందిన తబస్సుమ్‌ హసన్‌, ఎస్పీకి చెందిన నయీముల్‌ హసన్‌లు కైరానా, నూర్‌పూర్‌లలో గెలుపొందారు.

>
మరిన్ని వార్తలు