ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు..

31 May, 2018 18:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద చెంప పెట్టని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతోనైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పన, అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్లనే నాలుగు లోక్‌సభ రెండు, 11 అసెంబ్లీ స్ధానాల్లో పదింటిలో బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారని , ఇది ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి మూడో గర్వభంగం అన్నారు.

వరుసగా బీజేపీ అభ్యర్ధులు ఓడిపోతున్నా, ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. ఒక్క పాల్‌ఘర్‌ మినహా బీజేపీకి ఎక్కడా పరిస్థితులు సానుకూలంగా లేవని తెలిపారు. భారతీయ జనాతాపార్టీ పట్ల ఏర్పడిన వ్యతిరేకతే ప్రతిపక్షాల ఐక్యతకు పూనాది అయిందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రారంభమైన బీజేపీ పతనం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇక మోదీ శకం ముగిసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు