‘చంద్రబాబు వల్లే రెండుగా చీలిన బీజేపీ’

19 Jan, 2018 20:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ రెండుగా చీలిందని కాంగ్రెస్‌ నాయకుడు సి. రామచంద్రయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమాల గురించి కేంద్రానికి గవర్నర్ నరసింహన్‌ చెప్పడంతో ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులతో లేఖ రాయించారని అన్నారు. ‘నీ కులతత్వం, అరాచకాలు, దుర్వినియోగం, అవినీతి.. వీటన్నిటి గురించి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ చెప్పడంతో.. నీ బీజేపీ మిత్రులతో లేఖ రాయించావు. నీవల్ల బీజేపీ కూడా రెండుగా చీలింద’ని చంద్రబాబుపై రామచంద్రయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బాబు చేతకానితనం, ఓటుకు కోట్లు కేసులో దొరకడంతో ఆంధ్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. క్రిమినల్ కేసులో దోషివి కాబట్టే కేంద్రానికి భయపడుతున్నారని ఆరోపించారు. విభజన హామీలు ఎందుకు సాధించలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఏపీని నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో ఆయన చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే నైతికత బాబుకు లేదని, టీడీపీలోనే సామర్థ్యం ఉన్న మరో నాయకుడికి సీఎం పదవి కట్టబెట్టాలని సలహాయిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.

కాగా, ఏపీ కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంశాఖకు విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఈనెల 11న లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు బడ్జెట్‌ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ రావాల్సిందేనని  బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు