చంద్రబాబు అన్నం లేకుండా ఉండగలరు కానీ..

6 Jul, 2019 12:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నం లేకుండా ఉండగలరు కానీ, అధికారం లేకుండా ఉండలేరంటూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు అంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేంద్రం ఏడా పెడా పన్నులు పెంచింది. కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. పూర్తి మెజారిటీ వచ్చిందనే దర్పముతో రాష్ట్రాలు అవసరం లేదనే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు.

మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా దేశీయ మీడియా దెబ్బతింటుంది. ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప.. సామాన్యుల ఆదాయం కాదు. పన్నుల విధింపులలో పారదర్శకత లేదు. జీఎస్‌టీ ఏకీకృతం కాలేదు.. ముడి సరుకు, అంతిమ ఉత్పత్తి పైనా పన్నులు వేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధికి ఏమాత్రం ఈ బడ్జెట్ సహకరించదు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు.. విభజన చట్టంలో ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. పోలవరం నిధుల ప్రస్తావన లేదు.. రాజధాని నిధులు లేవు.. రైల్వేల విషయంలోనూ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింద’’ని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా