బాబు మానసిక పరిస్థితి సరిగా లేదు: రామచంద్రయ్య

8 Aug, 2019 16:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: పాలిచ్చే ఆవు అని భావించి.. 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు.. కానీ బాబు తన్నే దున్నపోతని తెలియడంతో ఓడించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచం‍ద్రయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ.. చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు గురువారం రామచంద్రయ్య ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజల్నే బాధ్యుల్ని చేసిన ఏకైక నేత చంద్రబాబే అన్నారు రామచంద్రయ్య. పదేపదే ప్రజల విజ్ఞతను ప్రశ్నించడం.. ‘ఎన్నో చేస్తే.. 23 సీట్లే ఇచ్చారు’ వంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బాబు ప్రజా తీర్పును కించపరుస్తున్నారని ఆయన మండి పడ్డారు. టీడీపీకి భవిష్యత్తు లేదనే నిర్థారణకు వచ్చి అనేక మంది నేతలు ఆ పార్టీని విడిచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు గత ఐదేళ్ల పాలన ఎన్నో అనుభవాలు నేర్పిందన్నారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోలేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భారీ నిధులు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రిని, హోం మంత్రిని కలిసి వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారని రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్‌ ఢిల్లీలో పర్యటిస్తుంటే.. చంద్రబాబు మతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. జగన్‌ ఢిల్లీ వెళ్లి, తనపై మోదీకి ఫిర్యాదు చేశారని బాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారు.. ఆయన మానసిక స్థితి సరిగా ఉందా అని రామచంద్రయ్య అనుమానం వ్యక్తం చేశారు. అంటే తాను తప్పులు చేసినట్లు చంద్రబాబు ఒప్పుకొన్నట్లేనా అని ఆయన ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు.. మానసిక స్థితిని పరీక్ష చేయించుకోవడం మర్చిపోయారంటూ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు

మరిన్ని వార్తలు