‘చంద్రబాబుపై కేసులే ప్రజలకు శాపం’

2 Feb, 2018 13:32 IST|Sakshi
కాంగ్రెస్‌ నాయకుడు సి. రామచంద్రయ్య

సాక్షి, కడప: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొండిచేయి చూపారని కాంగ్రెస్‌ నాయకుడు సి. రామచంద్రయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హక్కు పూర్వకంగా వచ్చేవి కూడా ఇవ్వలేదని, ఏపీని కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు లేవు.. కడప ఉక్కు పరిశ్రమ ఊసేలేదు, రైల్వేజోన్ ప్రకటనే లేదని వాపోయారు.

ఎంపీలు, కేంద్రమంత్రులు ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడకపోవడం శోచనీయమన్నారు. రాష్టానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా చూస్తూ కూర్చున్న ఏకైక ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు ఎన్టీఆర్ నిలబెడితే ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. చంద్రబాబు చేతకానితనం ఆయనపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని అన్నారు. ఇంకెంతకాలం చంద్రబాబు నాటకాలు ఆడతారని సూటిగా ప్రశ్నించారు.

ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికితే చాటు సంబరాలు చేసుకునే స్థితికి టీడీపీ నాయకులు దిగజారారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసే వ్యక్తులు, విదేశీ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు ఎగ్గొట్టిన నాయకులు కేంద్ర మంత్రులుగా ఉండటం బాధాకరమన్నారు. ఇటువంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

మరిన్ని వార్తలు