‘సొంత ఆస్తులు పెంచుకునేందుకే ఆయన పనిచేశారు’

28 Apr, 2019 11:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు రూ. 2లక్షల కోట్లకు పెరిగిపోయాయని అన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులకు, సొంత నిధులకు తేడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం చెల్లింపులు జరిపిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా అతిక్రమించి చంద్రబాబు అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పులు ఎందుకు చేశారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ అప్పుల భారం రాబోయే ప్రభుత్వం పడుతుందని వ్యాఖ్యానించారు.

ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకునేందుకే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. సీఎస్‌ ప్రభుత్వ  అవినీతిని బయటకు తీసుకోస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులపై సీఎస్‌ సమీక్ష జరిపితే చంద్రబాబు, టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఒక క్రమ పద్ధతి లేకుండా పోయిందని అన్నారు. నిబంధనలు అతిక్రమించి చంద్రబాబు అప్పులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌పై చంద్రబాబుకు ఎందుకంత కోపం అని నిలదీశారు.

చంద్రబాబుకు మినహాయింపు ఉండదు
స్టేలు అన్ని ఎత్తి వేయాలని సుప్రీం కోర్టు చెప్పింది కనుక చంద్రబాబు అక్రమాలకు శిక్ష తప్పదని రామచంద్రయ్య హెచ్చరించారు. కుటుంబరావు ఎవరని ప్రశ్నించారు. ఒక స్టాక్‌ బ్రోక్‌ ప్రభుత్వం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల కోడ్‌ దేశమంతా ఒకేలా ఉంటుందని.. చంద్రబాబు మినహాయింపు ఉండదని ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబు ఎందుకిలా గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే విచారణలు జరుతాయి.. అందుకే చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు