ఆర్టికల్‌ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం

10 Aug, 2019 11:31 IST|Sakshi

ఏడు నిమిషాల్లోనే కేం‍ద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదిన ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన ముందు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమయింది. ఈ భేటీకి మంత్రివర్గ సభ్యులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, అధికారులు కూడా హాజరయి కశ్మీర్‌పై అంశంపై చర్చించారు. అయితే  కీలకమైన ఈ సమావేశం కేవలం​ ఏడు నిమిషాల్లోనే ముగిసినట్లు తెలిసింది. భేటీపై ఓ​ సీనియర్‌ అధికారి వివరాలు వెల్లడిస్తూ.. ‘‘కేంద్రమంత్రి మండలి సమావేశం కేవలం ఏడు నిమిషాల్లోనే ముగిసింది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు అమిత్‌ షా వివరించారు. దానికి ప్రధానితో సహా మంత్రిమండలి సభ్యులంతా సుముఖత వ్యక్తం చేశారు’’ అని వెల్లడించారు.

కాగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఆర్టికల్‌ 370ని రద్దు చేసి చరిత్రలో మోదీ, అమిత్‌ షా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోడానికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. కానీ ఈ విషయం ఎవరికీ కూడా తెలియకుండా షా, మోదీ గోప్యంగా ఉంచారు. చివరి నిమిషంలో మంత్రిమండలి ఆమోదం తీసుకుని ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్పీకరించినప్పటి నుంచి మూడోకంటికి తెలియకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు, ఆందోళనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా అనూహ్యమైన చర్యలను చేపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్‌పై మెరుపుదాడులు, బాలాకోట్‌పై వైమానిక దాడి వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ చర్య దేశ ప్రజలనే కాక యావత్‌ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది.


 

మరిన్ని వార్తలు