మేఘాలయ, నాగాలాండ్‌లో నేడే ఓటింగ్‌

27 Feb, 2018 02:47 IST|Sakshi
నాంగ్‌పోలో ఈవీఎంలను తీసుకెళ్తున్న పోలింగ్‌ సిబ్బంది

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి మార్చి 3న ఫలితాలు

షిల్లాంగ్‌/ కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలు మినహా మిగతా అన్ని చోట్లా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నాగాలాండ్‌లోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు.

మేఘాలయ, నాగాలాండ్‌ సహా ఇప్పటికే ఎన్నికలు పూర్తైన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 120 నియోజకవర్గాలకు గానూ 118 చోట్ల పోలింగ్‌ జరగనుంది. మేఘాలయలో విలియమ్‌ నగర్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్‌ ఎన్‌ సంగ్మా మరణించడంతో అక్కడ ఎన్నిక నిలిపివేశారు. ఇక నాగాలాండ్‌లో ఎన్డీపీపీ చీఫ్‌ నెఫ్యూ రియో ఉత్తర అంగామి–2 నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ స్థానంలో ఎన్నిక జరగట్లేదు.

మహిళల కోసం పోలింగ్‌ కేంద్రాలు..
మేఘాలయలో దాదాపు 18.4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా 67 పోలింగ్‌ కేంద్రాలు సహా 61 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని మేఘాలయ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఎఫ్‌ఆర్‌ ఖార్‌కోంగర్‌ వెల్లడించారు. అలాగే తొలిసారి అత్యధికంగా 32 మంది మహిళలు ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇక నాగాలాండ్‌లో మొత్తం 11.91 లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌) నాగాలాండ్‌ చేరుకున్నాయని రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ అభిజిత్‌ సిన్హా వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది.

మరిన్ని వార్తలు