‘మూడో విడత’ ప్రచారానికి తెర

22 Apr, 2019 04:05 IST|Sakshi

రేపు 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశంలో మూడో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం తెరపడింది. మూడో విడతలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌(26), కేరళ(20), గోవా(2), దాద్రా నగర్‌ హవేలీ(1), డయ్యూ డామన్‌(1)లోని మొత్తం లోక్‌సభ స్థానాలకు.. అస్సాంలో 4, బిహార్‌లో 5, చత్తీస్‌గఢ్‌లో 7, జమ్మూకశ్మీర్‌లో 1, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమబెంగాల్‌లో 5 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. 

అమిత్‌షా పోటీ చేస్తున్న గాంధీనగర్‌(గుజరాత్‌), రాహుల్‌గాంధీ పోటీ పడుతున్న వయనాడ్‌(కేరళ), సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న మొయిన్‌పురి(ఉత్తరప్రదేశ్‌) స్థానాలకు మూడో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో కేంద్ర మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఎల్‌డీఎఫ్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పథినంతిట్ట జిల్లాలోని తిరువల్లలో బీజేపీ, కమ్యూనిస్టు కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసుతో సహా 30 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  

మరిన్ని వార్తలు