ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

20 May, 2019 08:11 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఇంకో చెప్పు కోసం ఎదురు చూస్తున్నానని నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ అన్నారు. ఈయన ఇటీవల హిందూ మతస్తుడైన గాడ్సేనే తొలి తీవ్రవాది అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కేసులు, కోర్టు వరకు వెళ్లింది. కాగా, ఎన్నికల ప్రచారంలో కొందరు దుండగులు కోడిగుడ్లు, టమాటాలు కమల్‌హాసన్‌పై విసిరారు. ఒక వ్యక్తి చెప్పును కూడా విసిరాడు.

ఈ ఉదంతం అనంతరం ఆదివారం ఉదయం నటుడు కమల్‌ హాసన్‌ ఒత్త చెరుప్పు సైజ్‌–7 (ఒక చెప్పు సైజ్‌ 7) అనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం పేరులో చెప్పు ఉండటంతో కమల్‌హాసన్‌ తనపై చెప్పు దాడిని ప్రస్తావించేలా ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు పార్తిపన్‌ తనకు గాంధీజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని కానుకగా అదించారన్నారు. నిజానికి గాంధీజీ జీవిత చరిత్రను తాను చాలా సార్లు చదివానని చెప్పారు. గాంధీజీ సూపర్‌ స్టార్‌ అని, ఆయనే తన హీరో అని పేర్కొన్నారు.

హీరోను విలన్‌గా, విలన్‌ను హీరోగా చూడలేమన్నారు. అదేవిధంగా విలన్‌ను హీరోగా అంగీకరించలేమన్నారు. ఒకసారి గాంధీజీ రైలులో ప్రయాణం చేస్తుండగా ఒక చెప్పు కనిపించకుండా పోయిందని, దాన్ని తీసుకున్నవారికి ఉపయోగపడాలని రెండో చెప్పును విసిరేశారన్న విషయాన్ని ఆయన జీవిత కథలో చదివానని తెలిపారు. అలా గాంధీ విసిరిన ఒక చెప్పు తనకు లభించిందని, రెండో చెప్పు కోసం ఎదురు చూస్తున్నానని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.

హే రామ్‌ చిత్రంలో ఆయన చెప్పులు తీసుకొని వస్తానన్నారు. అందుకోసం తాను పరిశోధన చేసినప్పుడు గాంధీజీ వాడిన కళ్లజోడు, చెప్పులు కనిపించకుండా పోయినట్లు తెలిసిందన్నారు. ఆ విషయాన్ని ఈ ఒత్త చెరుప్పు చిత్రంలో చర్చించకుండా ఉండరని భావిస్తున్నానన్నారు. అందుకే చిత్ర వర్గాలు భయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే, భయపడాల్సిన అవసరం లేదని, అది గర్వపడే విషయమేనని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు