కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు

13 Mar, 2018 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌రెడ్డిల మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. అరాచక శక్తులను సహించేది లేదని, కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని సీఎం ఆగ్రహించగా.. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని బీజేపీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. సస్పెన్షన్ల నిర్ణయం సరికాదని కిషన్‌రెడ్డి వాదించారు.

బాధాకరమే కానీ తప్పలేదు : ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు, 9 మందిపై సస్పెన్షన్‌ వేటు నిర్ణయాలు బాధకారమే అయినా తీసుకోక తప్పలేదని సీఎం తెలిపారు. ‘‘ప్రజలకు మాత్రమే మేం జవాబుదారీగా ఉంటాం. సభలో ఏ అంశాన్నైనా చర్చిస్తాం. కానీ అరాచక శక్తులను మాత్రం సహించే ప్రసక్తేలేదు. కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం తీవ్రంగా పెరిగింది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోబోం. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందుకే కాంగ్రెస్‌ సభ్యులపై తీవ్ర చర్యలను సిఫార్సుచేశాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

చరిత్ర మర్చిపోయారా? : ఇదే అంశంపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆవేశపూరిత నిరసనను అరాచకంగా భావించడం తగదన్నారు. ‘సభలోలేని విపక్ష ఎమ్మెల్యేను కూడా సస్పెండ్‌ చేసిన ఘన చరిత్ర టీఆర్‌ఎస్‌ సర్కారుది’’ అని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డి మాటలకు సీఎం సమాధానం చెప్పేప్రయత్నం చేశారు. దీంతో పలు మార్లు కిషన్‌రెడ్డి మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేయడం గమనార్హం.

టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ మద్దతు : కాంగ్రెస్‌ సభ్యులపై తీవ్ర చర్యలను టీఆర్‌ఎస్‌తోపాటు మజ్లిస్‌ కూడా సమర్థిస్తున్నదని ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. అసెంబ్లీలో నిన్న జరిగిన దాడిని ఎంఐఎం ఖండిస్తున్నదన్నారు.

మరిన్ని వార్తలు