'పంజాబ్‌కు ఏం కాదు.. కలిసే ఉంటుంది'

21 Feb, 2018 18:13 IST|Sakshi
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌తో కరచాలనం చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

సాక్షి, అమృత్‌సర్‌ : ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అన్నారు. భారత్‌లోగాని, మరెక్కడైనాగానీ విభజన ఉద్యమాలకు తమ దేశం మద్దతివ్వబోదని చెప్పారు. ఖలిస్థాన్‌ డిమాండ్‌ తగ్గుముఖం పట్టేందుకు కూడా తన వంతు కృష్టి చేస్తానంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్‌ ఎప్పటికీ కలిసే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని ఆయన హామీ ఇచ్చారు. కెనడాలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్‌ డిమాండ్‌ చేస్తుండటంతో ట్రూడో పంజాబ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ఖలిస్తాన్‌ డిమాండ్ సరైనది కాదని, ఐక్య పంజాబ్‌ తమకు కావాలని, ఈ డిమాండ్‌ తగ్గుముఖం పట్టేందుకు తమకు సహకరించాలని ట్రూడోను సీఎం అమరిందర్‌ సింగ్ కోరారు. 'నేను ట్రూడోకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఖలిస్తాన్‌ అనేది ప్రధాన సమస్య. దీనికోసం వివిధ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి మీరు సహకరించొద్దు. ఐక్యభారత్‌కు సహకరించాలి' అని తాను ట్రూడోను కోరినట్లు చెప్పారు. అందుకు ట్రూడో నుంచి సానుకూల ప్రకటన వెలువడింది.

మరిన్ని వార్తలు