ప్రతీ అభ్యర్థికి ప్రత్యేక బ్యాంకు ఖాతా

14 Mar, 2019 08:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ అభ్యర్ధి ప్రత్యేకంగా ఎన్నికల వ్యయం కోసం బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. నామినేషన్‌ దాఖలకు ముందు రోజునే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచి ఖర్చు చేసిన వ్యయం, అభ్యర్ధికి వచ్చే ఎన్నికల విరాళాలు అన్ని ఆ బ్యాంకు ఖాతా నుంచే జరగాలి. రోజుకు పది వేల రూపాయల లోపు వ్యయాన్ని నగదు రూపంలో చేయవచ్చు. పది వేలు దాటిన వ్యయాన్ని చెక్, ఆన్‌లైన్‌ లావాదేవీల్లోనే చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

తెలుపు, గులాబీ, పసుపు పేజీల రిజిష్టర్లు
ప్రతీ అభ్యర్ధి రోజు వారీ వ్యయానికి సంబంధించిన వివరాల కోసం ప్రత్యేకంగా రిజిష్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. రోజు వారీ వ్యయానికి సంబంధించి తెలుపు పేజీలతో కూడిన రిజిష్టర్‌ను, నగదు నిర్వహణకు సంబంధించి గులాబీ పేజీల రిజిష్టర్‌ను,  బ్యాంకు నిర్వహణకు సంబంధించి పసుపు పేజీల రిజిష్టర్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. పోటీ చేసే ప్రతీ అభ్యర్ధి ఈ లావాదేవీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏజెంటును ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఆ ఏజెంటువిరాళాలతో పాటు, వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను పైన పేర్కొన్న మూడు రిజిష్టర్లలో పొందుపరాచాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థికి వచ్చే విరాళాలు పార్టీ నుంచా, వ్యక్తుల నుంచా లేదా సొంత నగదా అనే వివరాలను కూడా రిజిష్టర్‌లో పొందుపరచాలి.

ప్రచార వ్యయంపై ప్రత్యేక దృషి
అభ్యర్ధుల ప్రచారం వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తోంది. ఆ పరిశీలకులు అయా అభ్యర్ధుల ఎన్నికల ప్రచార వ్యయంపై నిఘా ఉంచడంతో పాటు మూడు రిజిష్టర్లను, బ్యాంకు లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు. రాష్ట్రంలో లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల వ్యయం 70 లక్షల రూపాయలుగాను, అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల వ్యయం 28 లక్షల రూపాయలుగా ఎన్నికల సంఘం నిర్ధారించింది.అభ్యర్థి వాహనాలు, ప్రచారానికి సంబంధించిన మెటీరియల్, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, ఎస్‌ఎంఎస్‌తో పాటు ఇంకా ఇతర రంగాల ద్వారా చేసిన ఖర్చు ప్రచార వ్యయంలోకే వస్తాయి. ఇంకా ఆ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన వ్యక్తుల వ్యయాన్ని కూడా అభ్యర్థి ప్రచార వ్యయంగానే పరిగణిస్తారు. 

మరిన్ని వార్తలు