ఎన్నికల్లో ‘చిల్లర’ డిపాజిట్‌

6 Oct, 2019 04:48 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లాతూర్‌ స్థానం నుంచి స్వతంత్ర పోటీ చేస్తున్న ఓ యువ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. నామినేషన్‌ వేసేందుకు చెల్లించాల్సిన డిపాజిట్‌ రూ.10 వేల మొత్తాన్ని రూ. 10 రూపాయల నాణేలతో చెల్లించారు. సెంట్రల్‌ మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి పోటీ చేస్తున్న సంతోష్‌ సబ్డే (28) పట్టణంలో ఉన్న సమస్యను ఎత్తిచూపేందుకు, ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో పలు దుకాణాల్లో రూ. 10 నాణేలను స్వీకరించడం లేదని, దీన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలిపారు. మొదట ఎన్నికల అధికారులు కూడా రూ. 10 నాణేలను వద్దన్నారని, విషయం మీడియాకు తెలియడంతో రూ. 1000 వరకూ రూ. 10 నాణేలు తీసుకుంటామని, మిగిలింది నోట్ల రూపంలో ఇవ్వాలని కోరారని తెలిపారు. అయితే తాను ససేమీరా అనడంతో చివరకు మొత్తాన్ని రూ. 10 నాణేల రూపంలో స్వీకరించారని తెలిపారు. 

మరిన్ని వార్తలు