దాస్తేనే నేరం

13 Nov, 2018 01:02 IST|Sakshi

అభ్యర్థులు నేర చరిత్ర చెప్పాల్సిందే..

పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీలు నేరాల చిట్టా విప్పాల్సిందే..

వచ్చే నెల 5 వరకు డిక్లరేషన్‌కు అవకాశం

ఓటేసే అభ్యర్థి గుణగణాలు తెలుసుకోనున్న ప్రజలు 

అభ్యర్థుల గెలుపోటములపై పడనున్న ప్రభావం

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉంటే సదరు అభ్యర్థులతో పాటు వారిని బరిలోకి దింపే రాజకీయ పార్టీలూ నేర చరిత్రను తప్పక ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అమల్లోకి తెచ్చిన నిబంధన మున్ముందు రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురానుంది. ఇకపై లోక్‌సభ, శాసనసభ, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నేరాల చిట్టాను స్వయంగా బహిర్గతం చేయాల్సిందే. ఆయా నేరాలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వారు, నేరారోపణలు రుజువై శిక్షæ ఖరారైన వారు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఆ నేరాల చిట్టాను ప్రజల ముందుంచాలి. ప్రస్తుత శాసనసభ ఎన్నికలతో తొలిసారిగా రాష్ట్రంలో అభ్యర్థుల నేరాల చిట్టా ఓటర్ల చేతికి అందబోతోంది. అభ్యర్థుల నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించే స్థాయికి ప్రజల్లో చైతన్యం పెరిగితే ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఎందరో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. 

అన్నిచోట్లా అదే చర్చకు అవకాశం!
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నా యి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. 

సుప్రీంకోర్టు చొరవ.. ఈసీ దూకుడు    
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్‌ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇకపై పార్లమెంట్‌ ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే నేర చరిత్ర గల అభ్యర్థులతో పాటు అలాంటి అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలు నిర్దేశించిన ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత అక్టోబర్‌ 10న ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేర చరిత్రపై పత్రికలు, వార్తా చానళ్లలో జారీ చేసే ప్రకటనల ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమ చేయరాదని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.28 లక్షలకు మించరాదనే నిబంధన నేపథ్యంలో ఈ ప్రకటనల ఖర్చుకు మినహాయింపు ఇవ్వాలని కోరాయి. కానీ, నేర చరిత్రపై జారీ చేసే ప్రకటనల ఖర్చును సదరు అభ్యర్థులు, పార్టీల ఎన్నికల వ్యయం కింద లెక్కించాలని తాజాగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నేర చరిత్రను ప్రకటించకుంటే ఎన్నికల తర్వాత చర్యలు తప్పవని, సుప్రీం తీర్పు ఉల్లంఘన కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. 

5 వరకు నేర చరిత్ర బట్టబయలు
- నేర చరిత్ర కలిగిన అభ్యర్థులతో పాటు వారిని పోటీకి దింపే పార్టీలు నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రజాదరణ కలిగిన పత్రికతో పాటు వార్తా చానల్‌లో వేర్వేరు తేదీల్లో నేర చరిత్రపై నిర్దేశిత నమూనాల్లో కనీసం మూడు ప్రకటనలు జారీ చేయాలి.
- అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను తెలుపుతూ ఫార్మాట్‌–సీ1లో పొందుపరిచి పత్రిక/చానల్‌లో డిక్లరేషన్‌ ప్రచురించాలి. తమ నేర చరిత్రను తమ పార్టీకు తప్పనిసరిగా తెలపడంతో పాటు నేరాల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చాలి.
- నేర చరిత్ర గల అభ్యర్థులను బరిలోకి దింపే పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను ఫార్మాట్‌–సీ2లో పొందుపరిచి డిక్లరేషన్‌ ఇవ్వాలి. దీన్ని పార్టీ వెబ్‌సైట్‌లో ప్రదర్శనకు ఉంచాలి.
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (ఈ నెల 19) నుంచి పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందు (డిసెంబరు 5) వరకు కనీసం మూడు వేర్వేరు తేదీల్లో నేరచరితపై డిక్లరేషన్లను ప్రచురించాలి.

ఎవరు నేర చరితులు?
హత్య, హత్యాయత్నం, అత్యాచారం, అత్యాచారయత్నం, దోపిడీ, దొంగతనాలు, దాడులు, గూండాయిజం, కిడ్నాప్, అవినీతి, అక్రమార్జన, అక్రమ సారా, గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా వంటి తీవ్ర ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వారితో పాటు ఇలాంటి ఆరోపణలు రుజువై న్యాయస్థానాల నుంచి శిక్షæ పొందిన వారు. 

పెద్దక్షరాల్లో ‘నేరచరిత’
నేరచరిత గల అభ్యర్థులు.. పత్రికలు, ప్రసార సాధనాల్లో ఇచ్చే ప్రకటనల్లో ‘నేరచరిత’ గురించి ‘బోల్డ్‌’ (పెద్ద) అక్షరాల్లో ఇవ్వాలి. ఎవరి కంటాపడకుండా చిన్న సైజు అక్షరాల్లో ప్రకటనలిచ్చేసి చేతులు దులుపుకుందామనుకుంటే చెల్లదు. కనీసం 12 సైజ్‌ ఫాంట్‌తో ప్రకటన ఇవ్వాలి. వార్తా చానల్‌లో 7 క్షణాల పాటు ఆ ప్రకటనను ప్రదర్శించాలి. 

నేరాలకు ‘పట్టిక’ కట్టాలి
ఎన్నికల సంఘం నిర్దేశించిన పట్టిక రూపంలో అభ్యర్థులు/పార్టీలు నేర చరిత్రను ప్రకటించాలి. విచారణ పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులకు సంబంధించి కోర్టు పేరు, కేసు నంబర్, ప్రస్తుత స్థితి, ఏ చట్టంలోని ఏయే సెక్షన్లు, నేరానికి సంబంధించిన సంక్షిప్త వివరాలను ప్రకటించాలి. నేరం రుజువై శిక్ష పడితే కోర్టు పేరు, తీర్పు తేదీ, సంక్షిప్తంగా నేరం వివరాలు, విధించిన శిక్షను పట్టికలో చూపాలి. నేరానికి సంబంధించిన సంక్షిప్త వివరాల గడిలో నేర స్వభావమూ తెలపాలి. 
..::మహమ్మద్‌ ఫసియొద్దీన్‌

మరిన్ని వార్తలు