కోడెలపై తక్షణమే కేసు నమోదు చేయాలి

16 Apr, 2019 03:16 IST|Sakshi
మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పక్కన నాయకులు

ఆయనకేమైనా ప్రత్యేక చట్టం ఉందా? 

ముప్పాళ్ల ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలి

డిమాండ్‌లు నెరవేర్చకపోతే 17న నిరాహార దీక్ష చేస్తా

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు, అతని అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇనిమెట్లలో కోడెలపై దాడి అంటూ టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు చేసిన అనుమోలు జయరామ్‌ కోడెల చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ అని, సంఘటన జరిగిన ఒక రోజు తరువాత ఫిర్యాదు చేశారన్నారు.

కోడెల గానీ, గన్‌మెన్‌లు కానీ, కూడా వెళ్లిన నరసరావుపేటకు చెందిన అనుచరులు గానీ, పోలింగ్‌ సిబ్బంది కానీ ఫిర్యాదు చేయలేదన్నారు. ఘటనకు సంబంధంలేని వ్యక్తి ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఇనిమెట్లలోని 160 నంబరు పోలింగ్‌ బూత్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఐదుగురు వెళ్లి రాజుపాలెం పోలీసు స్టేషన్‌లో కోడెల, అతని అనుచరులపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోని పోలీసులు అత్యుత్సాహంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉండగా టీడీపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  

కోడెల శివరామ్‌కు తాబేదారుగా ముప్పాళ్ల ఎస్‌ఐ  
కోడెల శివరామ్‌కు ముప్పాళ్ల ఎస్‌ఐ ఏడుకొండలు తాబేదారుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముప్పాళ్ల మండలం నార్నెపాడు, పలుదేవర్లపాడు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఇళ్లల్లో మద్యం సీసాలు పెట్టి కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ పక్షపాతిగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐ ఏడుకొండలును సస్పెండ్‌ చేయాలన్నారు.

ఈ నెల 16న సాయంత్రంలోగా న్యాయపరమైన డిమాండ్‌లు పోలీసులు నెరవేర్చకపోతే ఈనెల 17న సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో  నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. కోడెలకు ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించారు.  పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ కోడెల చెప్పాడని చేసి ఆయన పాపాల్లో భాగస్వాములు కావద్దని పోలీసు అధికారులకు సూచించారు.  

మరిన్ని వార్తలు