మురళీమోహన్‌పై కేసు నమోదు

4 Apr, 2019 14:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజమండ్రి ఎంపీ, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై గురువారం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 2 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా జయభేరి ఉద్యోగులు జగన్మోహన్‌, ధర్మరాజులు వారికి డబ్బు ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌ రాజమండ్రిలో ఎదురుచూస్తుంటారని కూడా పేర్కొన్నారు. హైటెక్‌ సిటీ నుంచి సికింద్రాబాద్‌, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌ ట్రైన్‌లో రాజమండ్రికి తరలించేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిపై  ఐపీసీ సెక్షన్‌ 171(బీ), (సీ), (ఈ), (ఎఫ్‌) లకింద కేసు నమోదు చేశామ’ని వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్‌ కోడలు రూపకు అందజేయడానికే ఆ మొత్తం తీసుకెళ్తున్నామని నిందితులు అంగీకరించారు.

మరిన్ని వార్తలు