వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం క్షకసాధింపు

29 Oct, 2018 15:17 IST|Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని నిరసిస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇలా ధర్నాలు చేపట్టిన కార్యకర్తలపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా నాలుగు రోజుల క్రితం మంగళగిరిలో నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
మంగళగిరిలో నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు మరో 58 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఐపీసీ 341, 143, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీచేశారు.  ఈ నోటీసులు తీసుకునేందుకు ఎమ్మెల్యే ఆర్కేను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు.

గుంటూరు జిల్లాలోనూ..
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లాలో ధర్నా నిర్వహించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూడా తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తలు ఆళ్ళ హనుమంతరావు, దాసరి రాజు, బండ్ల పున్నారావు, ఏసురత్నం, శ్రీనివాసరెడ్డి, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, పసుపులేటి వెంటకట్రావు తదితరులపై తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఐపీసీ 341, 188, 143 సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. జననేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో దిగ్భ్రాంతి చెంది.. తాము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే.. ఆ విషయంలోనూ పోలీసులు వేధించేందుకు కేసులు పెడుతున్నారని, ఇది చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు