సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా

3 Jan, 2018 12:38 IST|Sakshi

రాంచి : దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలో దోషిగా తేలిన 15 మందికి రేపే శిక్ష ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావా కుంభకోణం రెండో కేసులో వీరందరిని గతేడాది డిసెంబర్‌ 23న దోషులుగా తేలుస్తూ సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణించడంతో అతడి కేసు తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాంచీ స్పెషల్‌ సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విషయంలో కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, తేజస్వి యాదవ్, మనోజ్‌ ఝాలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ముగ్గురు ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన మనోజ్ ఝా ఈ కేసు తీర్పు గురించి తాము ఒక్క మాట మాట్లాడకపోయినా కోర్టు తమకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు.

దోషిగా తేలిన అనంతరం నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాంచిలోని బిర్సా ముంద్రా సెంట్రల్‌ జైలులో ఉన్నారు. దావా కుంభకోణం తొలి కేసులో కూడా లాలూ దోషిగా తేలారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం రెండో కేసు విచారణలోనూ లాలూ దోషే అని తేలింది.  మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. 1991-96 కాలంలో దియోగఢ్‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేశారు. లాలూతో పాటు 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్‌ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.

>
మరిన్ని వార్తలు