సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ

10 Jul, 2019 02:50 IST|Sakshi

ఈడీ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్‌ ఆస్తులపై దాడులు

విజయవాడ, హైదరాబాద్‌లలో ఏకకాలంలో సోదాలు

భారీగా అక్రమాస్తుల గుట్టురట్టు

పదేళ్లలో 288 శాతం మేర పెరిగిన ఆస్తులు

దస్తావేజుల ప్రకారం రూ.3.74 కోట్లుగా ఆస్తుల గుర్తింపు

బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్లు ఉంటుందని అంచనా

తండ్రి, భార్య, కుమార్తెల పేరు మీద స్థిర, చరాస్తులు

2010–19 మధ్యనే భారీగా కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ

మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు

బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసినట్లు ఆరోపణల వెల్లువ

సుజనా కంపెనీలపై ఫిర్యాదులను పట్టించుకోని వైనం

అప్పట్లో లక్షల్లో ఆస్తి.. ఇప్పుడు కోట్లలో..

గాంధీ, ఆయన భార్యపై సీబీఐ కేసు

సాక్షి, అమరావతి/విజయవాడ/హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొంది, ఆయన ఆదేశాల మేరకు ఈడీలో నడుచుకున్నట్లు ఆరోపణలున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీఎస్‌ గాంధీ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. సుజనాచౌదరి కేసులనూ ఆయన నీరుగార్చారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలు, కార్యాలయంపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్, విజయవాడ, అమరావతిలలో తండ్రి నర్సింహారావు, భార్య శిరీషా, కుమార్తెల పేర్ల మీదనే కాక తన పేరు మీద కూడా గాంధీ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మొత్తంగా గాంధీ 288 శాతం మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలతో సహా తేల్చారు. రూ.3.74 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని కేంద్ర జీఎస్‌టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను నిందితులుగా చేర్చారు. 2010 జనవరి 1 నుంచి 2019 జూన్‌ 27 వరకు ప్రభుత్వోద్యోగిగా గాంధీ ఉద్దేశపూర్వకంగా తన ఆస్తులను పెంచుకునేందుకు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని సీబీఐ అధికారులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బీఎస్‌ గాంధీపై ఐపీసీ సెక్షన్‌–109, ప్రీవెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ 1988లోని 13 (2), 13(1)(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ (ఏసీబీ) వి.వివేకానందస్వామికి అప్పగిస్తూ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్‌ ప్రొసీడింగ్స్‌ జారీచేశారు.
 
బాబుకు అత్యంత సన్నిహితుడు..
బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్‌ 27న సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్‌ కమిషనరేట్‌–1లో పోస్టింగ్‌ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌)కి వెళ్లారు. అక్కడి నుంచి 2004లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత జీఎస్‌టీకి బదిలీ అయ్యారు. ఈ బదిలీ కూడా నిబంధనలను పట్టించుకోకుండా జరిగినట్లు సమచారం. అప్పట్లో అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఓ అధికారి ప్రోద్బలంతో బీఎస్‌ గాంధీని నియమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఆయన పే గ్రేడ్‌ రూ.5,400. సవరించిన వేతన స్కేల్‌ ప్రకారం ఆయన లెవల్‌–9 కింద జీతాన్ని అందుకుంటున్నారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పనిచేశారు. 

సుజనా కేసులు దర్యాప్తు చేస్తోందీ ఇతనే..
కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలుచేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. తమ ప్రయోజనాల మేరకు గాంధీ పనిచేయడంతో అప్పటి అధికార పార్టీ వర్గాలు ఆయనకు రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిని కట్టబెట్టినట్లు కూడా సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గాంధీ విజయవాడ చుట్టపక్కల ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టడంపై సీబీఐ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. జీఎస్‌టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.

అప్పుడున్న ఆస్తులు రూ.21 లక్షలే..
2010–2019 మధ్య కాలంలో గాంధీ తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గాంధీ అక్రమాస్తుల లెక్కింపునకు సీబీఐ అధికా>రులు ఈ 2010–19 మధ్య కాలాన్ని చెక్‌ పీరియడ్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. 2010 జనవరి 1 నాటికి ముందు గాంధీ స్థిర, చరాస్తుల విలువ రూ.21,00,845గా ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. జూన్‌ 27, 2019 నాటికి గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.2,74,14, 263కు చేరుకున్నట్లు తేల్చారు. అలాగే, 2010–19 మధ్య కాలాంలో గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని రూ.1,30,07,800లుగా సీబీఐ అధికారులు తేల్చారు.

2011–14 మధ్య కాలంలో నారాయణ ఒలింపియాడ్‌లో కుమార్తె చదువు నిమిత్తం రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అంతేకాక, రామచంద్ర యూనివర్సిటీలో కుమార్తె ఎంబీబీఎస్‌ కోర్సు కోసం రూ.70 లక్షలు చెల్లించినట్లు తేల్చారు. కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ఇంటి నిర్మాణం కోసం గాంధీ ఏకంగా రూ.1.20 కోట్లు వెచ్చించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ఇంటికి సంబంధించి రూ.27 లక్షల రుణాన్ని చెల్లించారు. ఆస్తులు, ఖర్చులను రూ.5.04 కోట్లుగా తేల్చిన అధికారులు, ఆదాయాన్ని మాత్రం రూ.1.30 కోట్లుగా గుర్తించారు. ఈ విధంగా ఆయన మొత్తం రూ.3,74,73,046  ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలు తేల్చారు. 

సీబీఐ గుర్తించిన ఆస్తులివే..

  • కృష్ణాజిల్లా కంకిపాడులో గాంధీ తండ్రి బి.నర్సింహారావు పేరు మీద 360 చదరపు గజాల స్థలం, ప్రొద్దుటూరులో తండ్రి పేరు మీద 266.66 చ.గ. స్థలం.
  •  కొండాపూర్, రాజరాజేశ్వరి నగర్‌లో తండ్రి పేరు మీద రూ.17.15 లక్షల విలువ చేసే 93,300 చ.గజాల స్థలం.
  • కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌లో గాంధీ పేరు మీద రూ.29.56 లక్షల విలువ చేసే 257.83 గ. స్థలం, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో 10 గుంటల స్థలం. ఇందులో గాంధీ భార్య శిరీషా వాటా రూ.12.31 లక్షలు. 
  • విజయవాడ ఎనికేపాడు గ్రామంలో భార్య శిరీష పేరు మీద రూ.28.71 లక్షల విలువ చేసే 0.43 సెంట్ల భూమి, తరిగొప్పుల గ్రామంలో కుమార్తె పేరు మీద రూ.15.67 లక్షల విలువ చేసే 2.96 ఎకరాల భూమి.
  • గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రూ.2.72 లక్షల విలువ చేసే 0.42 సెంట్ల భూమి.
  •  విజయవాడ, గుణదల వార్డు నెంబర్‌ 31లో రూ.72.87 లక్షల విలువ చేసే 327 చ.గజాల భూమి. ఇది గాంధీ తండ్రి, భార్య, మరొకరి పేరు మీద ఉంది. 
  •  విజయవాడ శివారు పెదపులిపాక గ్రామంలో రూ.9.14 లక్షల విలువ చేసే 242 చ.గజాల స్థలం, కానూరులో తండ్రి, చిన్న కుమార్తె పేరు మీద రూ.45.15 లక్షల విలువ చేసే 400 గ.స్థలం.
  • హైదరాబాద్‌ కూకట్‌పల్లి యాక్సిస్‌ బ్యాంకులో భార్య శిరీష పేరు మీద రూ.20 లక్షల బ్యాలెన్స్, తండ్రి పేరు మీద ఉన్న జాయింట్‌ ఖాతాలో రూ.10.12 లక్షల బ్యాలెన్స్, శిరీష పేరు మీద రూ.6.50 లక్షల విలువ చేసే ఫోక్స్‌వ్యాగన్‌ పోలో కారు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. 
మరిన్ని వార్తలు