ఈసీలో అసమ్మతి ‘లావా’సా

19 May, 2019 04:57 IST|Sakshi
అశోక్‌ లావాసా, సునీల్‌ అరోరా

నా అసమ్మతిని రికార్డు చేయనిదే సమావేశాలకు రాను

సీఈసీకి లేఖ రాసిన కమిషనర్‌ లావాసా

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయాల్లో తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటానని ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరాకు లావాసా లేఖ రాయడం కలకలం రేపింది.

మరోమార్గం లేకనే దూరంగా ఉంటున్నా
ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా నియమావళిని ఉల్లంఘించడంపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల విషయంలో తన అభిప్రాయాన్ని రికార్డు చేయనందుకు కమిషనర్‌ అశోక్‌ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. 16న సీఈసీ అరోరా లేఖ రాశారు. అందులో ‘ఈసీలో పారదర్శకత ఉండాలన్న తన నోట్‌పై స్పందించనందుకు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై దూరంగా ఉండటం మినహా మరోమార్గం లేదని భావిస్తున్నా. మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసేదాకా కమిషన్‌ సమావేశాలకు గైర్హాజరు కావాల్సిన పరిస్థితిని కల్పించారు. అసమ్మతిని రికార్డు చేయనప్పుడు సమావేశాల్లో పాల్గొనడంలో అర్థంలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సందర్భాల్లో నేను వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం బహుళ సభ్యుల చట్టబద్ధ సంస్థలు పాటించే సంప్రదాయాలకు భిన్నంగా అణచివేతకు గురైంది’ అని పేర్కొన్నారు.  

న్యాయ నిపుణులు ఏమన్నారంటే..
నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే అంతిమం అవుతుంది. నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ట్రిబ్యునల్‌లో మాదిరిగా విచారణ ఉండదని, ఈసీ నిర్ణయాలపై సీఈసీతోపాటు మిగతా ఇద్దరు సంతకాలు చేస్తున్నందున మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. మెజారిటీ అభిప్రాయాన్నే ఈసీ నిర్ణయంగా వెలువరిస్తారని, అసమ్మతి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారే తప్ప బహిర్గతం చేయబోరని అంటున్నారు. మోదీ, అమిత్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన 11 ఫిర్యాదులపై లావాసా అసమ్మతిని తెలపగా కమిషన్‌లోని సీఈసీ, మరో సభ్యుడు సుశీల్‌చంద్ర అన్ని ఫిర్యాదులపై క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

ఆరోపణలపై విచారణ: కాంగ్రెస్‌
ఈసీపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న లావాసా ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా.. ‘మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ‘ఎలక్షన్‌ ఒమిషన్‌’గా మార్చేసింది. లావాసా అసమ్మతిని రికార్డు చేసి ఉన్నట్లయితే ఈసీని ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు పెట్టి ఉండేది’ అని అన్నారు. మోదీ– అమిత్‌ షా ద్వయం ఉల్లంఘనలపై కమిషనర్‌ లావాసా పలు పర్యాయాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం వారికి క్లీన్‌చిట్‌ ఇవ్వడమే పనిగా పెట్టుకుందని ఆరపించారు. లేఖలో పేర్కొన్న అంశాలను తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. సుప్రీంకోర్టులో తీర్పుల సందర్భంగా జడ్జీలు వ్యక్తం చేసిన మెజారిటీతోపాటు మైనారిటీ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా ఈసీలో అసమ్మతి అభిప్రాయాన్ని ఎందుకు బహిర్గతం చేయరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సంఘంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.  

ఇది ఈసీ అంతర్గత విషయం: సీఈసీ అరోరా
ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా లేఖ ఎన్నికల సంఘం అంతర్గత విషయమని సీఈసీ అరోరా అన్నారు. ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యల విషయంలో ఈసీ పనితీరుపై మీడియాలో వచ్చిన కథనాలు ‘అభ్యంతరకరం. ఇది ఈసీ అంతర్గత విషయం’ అని అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కూడా ఒకే వైఖరితో ఉండాలని ఏమీ లేదు. గతంలో ఎన్నోసార్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది సహజం. కానీ, అదంతా ఎన్నికల సంఘం పరిధికి లోబడి జరిగింది.  ఇటీవల మే 14వ తేదీన జరిగిన సమావేశంలోనూ ప్రవర్తనా నియమావళిసహా 13 అంశాలను పరిష్కరించేందుకు గ్రూపుల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు నేను వెనుకాడలేదు. ఆఖరి దశ ఓటింగ్,23న లెక్కింపు వేళ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మిగతా విషయాలపై చర్చించేందుకు 21న ఈసీ పూర్తిస్థాయి సమావేశం ఉంటుంది’ అని అరోరా వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు