విభేదించినా విచ్చేసిన ప్రముఖులు..

8 Jun, 2018 03:35 IST|Sakshi

తమ సిద్ధాంతాలతో విభేదించే జాతీయ నాయకులు, ప్రముఖులకు గతంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం పలికింది.

► 1933లో బ్రిటిష్‌ హయాంలో సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ హోం మంత్రిగా ఉన్న సర్‌ మోరోపంత్‌ జోషిని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ ఆహ్వానించారు.

► 1934 డిసెంబర్‌ 25న వార్దాలోని ఆర్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని మహాత్మా గాంధీ స్వచ్ఛందంగా సందర్శించారు. హెడ్గెవార్‌తో ఆయన చాలా సమయం సంభాషించారు.

► లోక్‌నాయక్‌ జయప్రకాష్‌నారాయణ్‌ సంఘ్‌ కార్యకర్తల సమావేశంలో అతిథిగా పాల్గొన్నారు.

► ప్రముఖ సామాజిక కార్యకర్త అభయ్‌ భాంగ్, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్, రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ ఇండియా(గవాయ్‌)అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ గవాయ్, నేపాల్‌ మాజీ సైన్యాధ్యక్షుడు రుక్మాంగద్‌ కటావాల్‌లు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యారు.

► 2007లో సర్‌సంఘ్‌చాలక్‌ కేఎస్‌ సుదర్శన్‌ ఆహ్వానంపై మాజీ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏవై టిప్నిస్‌ అతిధిగా పాల్గొన్నారు. లౌకికత్వాన్ని గౌరవించాలని, ఇతర మతాల పట్ల ఓర్పు, సహనంతో వ్యవహరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. టిప్నిస్‌ వాదనను తిప్పికొడుతూ ఒక్కొక్క అంశంపై సుదర్శన్‌ ప్రసంగించారు.

► 1963 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానించారని, అలాగే రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని సందర్శించారని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. ‘సంఘ్‌ శిక్షా వర్గ్‌’ ఏడాదికోసారి జరుగుతుంది. 1927లో హెడ్గెవార్‌ దీనిని ప్రారంభించినపుడు ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌’గా పిలిచేవారు. అనంతరం సంఘ్‌ బాధ్యతలు చేపట్టిన గోల్వాల్కర్‌ దీని పేరును ‘సంఘ్‌ శిక్షా వర్గ్‌’గా మార్చారు.

సైద్ధాంతికంగా విభేదించినా.. అవసరాన్ని బట్టి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదింపులు, సమాలోచనలు జరిపేవారని తెలుస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం, మండల్‌ కమిషన్‌ వివాదం అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల కాంగ్రెస్‌ కఠిన వైఖరి ప్రారంభమైందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు