కాంగ్రెస్‌ది తాత్కాలిక ముచ్చటే.. పుల్వామాతో మారిన సీన్‌..

24 Mar, 2019 10:37 IST|Sakshi

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌: దేశంలో 17వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమై ఏడు దశల్లో జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ ఎలయెన్స్‌ (ఎన్డీయే) 543 స్థానాలకు గాను 264 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) 141 స్థానాలను గెలుచుకోవచ్చని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే బలంగా ఉందని చెప్పడంలో సందేహం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్,  ఇతర ప్రతిపక్షాలు ఎన్డీయేకి ఎటువంటి ప్రత్యామ్నాయాన్నీ ఇప్పటి వరకూ చూపలేకపోతున్నట్టు కూడా సర్వే వెల్లడించింది. దేశంలో మోదీ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ రీసెర్చ్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో బీజేపీని ముందుంచుతున్నదేమిటి? విపక్షాన్ని వెనుకంజ వేయిస్తున్నవేమిటి?

డిసెంబర్‌ 2018లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ప్రజాభిప్రాయం బీజెపీ వైపు నుంచి కాంగ్రెస్‌ వైపు మొగ్గినట్టు అనిపించింది. అయితే అది తాత్కాలిక ముచ్చటేనని తదనంతర పరిణామాలు నిరూపించాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకబాటును పుల్వామా దాడి అనంతర పరిణామాలు మార్చేశాయి. భారత భద్రతా బలగాల ఊచకోత తర్వాత భారత వాయుసేన పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల వల్ల బీజేపీకి ప్రజావిశ్వాసం కొంత పెరిగినట్టు అర్థమవుతోంది. జాతీయ భద్రతాంశాలే కాకుండా ప్రతిపక్షాల వెనకడుగుకు మరికొన్ని కారణాలూ కనిపిస్తున్నాయి. 

ప్రధాని అభ్యర్థి ఎవరు?
2014 మాదిరిగానే బీజేపీ మోదీ కేంద్రంగా ప్రచారోద్యమాన్ని ఉధృతం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు మోదీని ఎదుర్కోవడానికి ఆయనకు దీటైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నుంచి కానీ, దాని భాగస్వామ్య పక్షాల నుంచి కానీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే అది బీజేపీకి మేలు చేసే విధంగానే ఉంటుంది తప్ప విపక్షాల ఐక్యతను కాపాడలేదని కూడా చెప్పొచ్చు.

విపక్షాల మాటల్లో కొరవడిన స్పష్టత
ప్రజావిశ్వాసాన్ని చూరగొనే ప్రత్యేక కార్యక్రమాన్నీ ప్రతిపక్షం ప్రజల ముందుకు సరైన రీతిలో ఉంచలేకపోతోంది. పేదలకు క్రమం తప్పకుండా కచ్చితమైన ఆదాయ వనరుని చూపిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దీని ద్వారా ఎవరు లబ్ధి్దపొందుతారు? ఈ పథకం అమలుకు ఆర్థిక  వనరులను ఎలా సమకూరుస్తారనేది ప్రతిపక్షం వివరించలేకపోతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్న రైతులకు రూ.6,000 నగదు మూడు దఫాలుగా చెల్లిస్తామని ప్రకటించి అమలుకు సైతం పూనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల చాలామంది రైతులకు రూ.2,000 చొప్పున వారి ఖాతాల్లో జమచేశారు. 

సమస్యల్ని వెలుగులోకి తేలేకపోవడం..
దేశంలోని ప్రధాన సమస్యలైన వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగ సమస్య లాంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉన్నా అది చేసి లబ్ధి పొందడంలో కూడా ప్రతిపక్షం చురుకుగా వ్యవహరించలేకపోతోంది. ఈ అంశాలనే లేవనెత్తి  2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. 

పొత్తుల్లోనూ...
అధ్యక్ష తరహా ప్రచారానికి పూనుకుంటున్నప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో పొత్తులు, సర్దుబాట్లు వంటి విషయాల్లో భారతీయ జనతాపార్టీ ప్రతిపక్షాల కన్నా చాలా ముందుంది. ఎప్పటిలాగే స్థానిక సమస్యలు కూడా ప్రచారంలో కీలక భూమిక పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో బిహార్‌లో నితీష్‌కుమార్‌తో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ 2014లో గెలిచిన స్థానాలను కూడా ఒప్పందంలో భాగంగా వదులుకోవడానికి సిద్ధపడింది. అదేవిధంగా మహారాష్ట్రలోనూ శివసేనతో పొత్తుకుదుర్చుకుని వారికి ఎక్కువ స్థానాలు కేటాయించింది. 

వినపడని ఐక్యతారాగం
ప్రతిపక్షాల విషయానికి వస్తే వివిధ ప్రతిపక్ష పార్టీలను కలుపుకునే విశాల ఐక్య సంఘటన కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రధాన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్‌ పార్టీని దూరం పెట్టాయి. బలమైన ప్రాంతీయ పార్టీలైన మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎంత వరకు కలిసి పనిచేస్తుందనేది స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీని అ«ధికార పీఠం ఎక్కకుండా నిరోధించడం అంత తేలికైన పనికాదని, అందుకు ప్రతిపక్షం మరింతగా కష్టపడాల్సి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ పరిస్థితి మరికొన్ని వారాలు ఇలాగే కొనసాగితే ప్రతిపక్షానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు