అన్ని రంగాల్లో కేంద్రం విఫలం 

19 Nov, 2018 04:09 IST|Sakshi

ఎన్నికల్లో లబ్ధికి మతాన్ని తెరపైకి తెచ్చిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ  

ఉత్తరాదిన అయోధ్య, దక్షిణాదిన శబరిమలతో బీజేపీ చెలగాటం 

రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ 

లౌకికతత్వ పరిరక్షణే ధ్యేయం 

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌  

సాక్షి, అమరావతి/గన్నవరం: అన్ని రంగాలలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మతాన్ని అడ్డం పెట్టుకుని దేశ ప్రజల్ని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ ధ్వజమెత్తారు. ఉత్తరాదిన అయోధ్య, దక్షిణాదిన శబరిమలను అస్త్రాలుగా చేసుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం అనే అంశంపై విజయవాడలో, ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు– కర్తవ్యాలు’ అనే అంశంపై గన్నవరంలో ఆదివారం జరిగిన సదస్సుల్లో ఆయన ప్రసంగించారు.

ప్రజల్లో పెద్దఎత్తున ఆశలు కల్పించి 2014లో అధికారాన్ని చేజిక్కించుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. మతోన్మాద హిందూత్వ అజెండాతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏమి చెబితే అది చేస్తోందని విమర్శించారు. ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలను మట్టుబెట్టేందుకు నడుంకట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనమంతా తెల్లధనమైందని, తిరిగి వచ్చిన పెద్దనోట్లు అసలు కన్నా ఎక్కువగా ఉన్నాయంటే సాధించిందేమిటన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే మరోపక్క దేశంలో అవినీతి విచ్చలవిడి అయిందనే దానికి నిదర్శనమే రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అన్నారు. యుద్ధ విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్‌ అంబానీకి అప్పగించిన రూ.21 వేల కోట్ల ఈ కాంట్రాక్ట్‌ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం..
మోదీ హయాంలో ఆర్థిక, న్యాయ, విద్య సహా పలు రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని కారత్‌ ఆరోపించారు. చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే సహించబోమనే స్థితికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వచ్చాయన్నారు. శని సింగనాపూర్‌ దేవాలయంలోకి మహిళల్ని అనుమతించాలని కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ అవకాశవాదాన్ని సహించబోమని హెచ్చరించారు. అమలు చేయలేని తీర్పులు, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే తీర్పులు కోర్టులు ఇవ్వొద్దని అమిత్‌ షా చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. మతోన్మాద హిందూ దేశాన్ని స్థాపించాలన్న బీజేపీ కలల్ని వమ్ము చేస్తామన్నారు. లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ సైతం శబరిమల వ్యవహారంలో అవకాశవాదాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యాసదృశ్యమన్నారు.  

సీబీఐకి నో ఎంట్రీపై చర్చించలేదు..
రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ దానిపై తమ పార్టీ ఇంకా చర్చించలేదని, 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం మాట్లాడతామన్నారు. అయితే సీబీఐలో లుకలుకలు పెరిగిపోయాయని, బీజేపీ నియమించిన డైరెక్టరే ప్రస్తుతం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వచ్చే వారం ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. బీజేపీని ఓడించడం, కేంద్రంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పార్లమెంటులో వామపక్ష పార్టీల బలాన్ని పెంచుకోవడం తమ ఎన్నికల విధానమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

మరిన్ని వార్తలు