టైమ్‌ బాగుందనే..

6 Aug, 2019 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పది రోజుల ముందు ప్రధాని మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్‌ విషయంలో దశాబ్దాలుగా రగులుతున్న సమస్యను పరిష్కరించామన్న ఖ్యాతితోపాటు కల్లోల ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఏకాకిగా మారిన దాయాదితోపాటు బలహీన విపక్షాలు సుస్థిర సర్కారు కలిసొచ్చాయి. ఎదురు లేకుండా నిర్ణయాలను నెగ్గించుకుంది.

సుస్థిరతకు ఢోకా లేదనే..
వరుసగా రెండోసారి ప్రధాని మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, దరిదాపుల్లో ఎన్నికలేవీ లేకపోవడంతో 370 ఆర్టికల్‌ రద్దు, జమ్ము కశ్మీర్‌ పునర్విభజనపై కేంద్రం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని వేగంగా తీసుకుంది. తన వ్యూహం బెడిసికొట్టినా సర్కారు సుస్థిరతకు వచ్చే ముప్పు కూడా ఏదీ లేకపోవడంతో చకచకా అమలు చేసింది. విపక్ష సభ్యుల చేరికలతో రాజ్యసభలోనూ బలం పెరగడంతో బిల్లును నెగ్గించుకోగలమనే నమ్మకానికి వచ్చింది. రాజ్యసభలో తగినంత మంది సభ్యులు మద్దతు కూడగట్టే బాధ్యతను అనిల్‌ బలూని, భూపేంద్ర యాదవ్‌లతో కూడిన బృందానికి అమిత్‌ షా అప్పగించారు. బీఎస్పీ నేత సతీష్‌ మిశ్రా మద్దతు కూడా లభించడంతో ఎగువ సభలోనూ ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. 

ఏకాకిగా మారిన దాయాది..
సైనిక బలగాల పరంగా చూసినా కూడా భారత్‌ ఇప్పుడు మెరుగైన స్థితిలో కదనోత్సాహంతో ఉంది. బాలాకోట్‌పై వైమానిక దాడులు, పాక్‌ చెరలో చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చి విడుదల చేయించడం ద్వారా భారత్‌ మరోసారి తన పైచేయిని నిరూపించుకుంది. వరుస పరిణామాలతో పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. తన ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనా నుంచి కూడా పాక్‌కు మద్దతు కరువైంది. ఇతర దేశాలేవీ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలు లేవని బాలాకోట్‌పై వైమానిక దాడుల సమయంలోనే రుజువైంది. తమ దేశంలో ఉగ్రమూకలు భారీగా తిష్ట వేసినట్లు స్వయంగా పాక్‌ ప్రధానే అంగీకరించారు. దాయాది అప్పుల్లో కూరుకుపోయి ప్రతిఘటించలేని స్థితికి చేరుకోవడం, బలహీన ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కశ్మీర్‌పై గట్టి నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇదే సరైన తరుణమని కేంద్రం భావించింది. కశ్మీర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యం కోసం ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా ప్రయత్నించడంతో భారత్‌ అప్రమత్తమైంది. తన వ్యవహారాలను తానే చక్కదిద్దుకునే సత్తా ఉందని చాటడంతోపాటు ఇతర దేశాలు తలదూర్చటాన్ని సహించబోమని గట్టి సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించింది. జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆర్నెళ్లు పొడిగించడం, రాష్ట్రంలో పరిస్థితులన్నీ తమ కనుసన్నల్లోనే ఉండటంతో బిల్లుపై ముందుకు కదిలింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ అంశానికి తాము సరైన ముగింపు పలికామన్న ఖ్యాతి దక్కించుకోవడంతోపాటు విపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉండటంతో ఇక ఎదురే లేకుండా పోయింది.

బలహీన విపక్షాలు.. 
బీజేపీని దీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ విఫలం కావడం, పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని రాహుల్‌ చేతులెత్తేయటం, విపక్షాలు చెల్లాచెదురు కావడం, సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం మోదీ సర్కారుకు కలిసొచ్చాయి. ఎన్డీయేతర పక్షాలు కూడా మోదీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిని కేంద్రం కల్పించింది. 

అనుకూల వాతావరణం.. 
భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించడం, వర్షాలు పడుతుండటంతో కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం ఉగ్రవాదుల కదలికలు పెద్దగా లేవు. ఇక వచ్చే చలికాలంలోనూ ప్రతికూలత కారణంగా ఉగ్రవాదుల సంచారం తక్కువగా ఉంటుంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నందున కేంద్రం కశ్మీర్‌పై ముందడుగు వేసింది.  
 

మరిన్ని వార్తలు