విశాఖ మెట్రో..రేసులో ఐదు సంస్థలు

19 Jul, 2018 21:52 IST|Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ: విశాఖపట్నంలో పీపీపీ విధానంలో మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వ షార్ట్‌లిస్ట్‌ చేసింది. వారికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్ ఇంటరెస్ట్‌(ఈఓఐ)ని ఆహ్వానించగా పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన పిమ్మట ఆర్‌ఎఫ్‌సీలను జారీ చేయడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. మెట్రో రైల్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిన తర్వాత విశాఖపట్నం మెట్రోరైల్‌  నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో ఎన్ని కారిడార్లు ఉంటాయి. ప్రతి కారిడార్‌ పొడవు ఎంత అన్న ప్రశ్నలకు మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు.

 నగర రవాణా వ్యవస్థ నగర అభివృద్ధిలో ఒక అంతర్భాగం. ఇది పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుంది. అందువలన మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాష్ర్ట ప్రభుత్వాలే రూపొందిస్తాయి. అందువలన విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి, మొత్తం ఎంత వ్యయం అవుతుందో  ఏపీ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నట్లయితే ఆ ప్రతిపాదనలు మెట్రో రైల్‌ విధానంలోని పలు అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలని మంత్రి స్పష్టం చేశారు.

 ఏపీ ప్రభుత్వం 20,500 మంది సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లకు ఉద్వాసన పలికిన అంశంపై విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి మంత్రి ఉపేంద్ర కుష్వాహా జవాబిస్తూ..వారిని తొలిగించినట్లుగా రాష్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. త్వరలోనే సాక్షర భారత్‌ స్థానంలో కొత్త పథకం అమలులోకి వస్తుంది. సాక్షర భారత్లో కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వారి సేవలను కొత్త పథకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. గడచిన నాలుగేళ్ల కాలంలో సాక్షర భారత్‌ పథకం అమలు కోసం మొత్తం 498.99 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు