‘వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూతపడదు’

19 Dec, 2018 17:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్‌ కమిటీ గత నవంబర్‌ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

విశాఖపట్నంలాంటి మేజర్‌ ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడం వలన దానిపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్‌ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడీసీఎల్‌)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.

కొండపల్లి ఆయిల్ పైపులైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్‌లైన్‌ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు.

మరిన్ని వార్తలు