‘కేసీఆర్‌ భాష సరిగా లేదు’

19 May, 2020 12:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : అంతర్జాతీయ మీడియా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం‌ విమర్శిస్తున్నారని, ఆయన భాష సరిగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. దేశం మోదీ వెంట నడుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. మంగళవారం కిషన్ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా సమయంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అవసరమా? కేంద్రం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించింది. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లబ్ధి జరగదా?. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిధిని 3నుంచి 5 శాతానికి పెంచాం. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ సంస్కరణల్లో లోపాలు ఏమున్నాయో కేసీఆర్‌ చెప్పాలి. (కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్‌)

రాష్ట్రాల వాటా అని గతంలో కేసీఆర్‌ మంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు చెప్పలేదు. వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌ ద్వారా సంస్కరణలు చేపట్టాం. కేసీఆర్‌ చెప్పినట్లు పంటలు వేయకపోతే రైతుబంధు పథకం వర్తించదా?. పంటల సాగు విషయంలో మీ విధానాలను వ్యతిరేకిస్తున్నామా?.  మూసపద్ధతిలో పాలన ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతపట్టుకుని గల్ప్‌ దేశాలకు వలసలు పోతున్నారు. రాష్ట్రాలనుంచి వలసలు వెళ్లకుండా మార్పు జరగకూడదా?. పాలనలో సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా?. సంస్కరణలు గిట్టుబాటు ధరల కోసం చేశారేమో? కేంద్రం నిధులుండి ఇవ్వకపోతే విమర్శించాలి. ఉపాధి హామీ పనుల నిధులు మిషన్‌ కాకతీయకు ఖర్చుపెట్టలేదా’’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు