ఎగుమతులు తగ్గిపోయాయి

28 Jan, 2018 04:14 IST|Sakshi

కేంద్రం ప్రజా బడ్జెట్‌ రూపొందించాలి: బీవీ రాఘవులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.15 వేల కోట్ల ఎగుమతులు తగ్గిపోయాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్లలో ఏర్పాటు చేయాలనుకున్న డ్రైపోర్టులను మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది కేంద్రం ప్రజా బడ్జెట్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టాయని, వ్యవసాయాన్ని విస్మరించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు నష్టాల్లో ఉన్నారని వీరిని ఆదుకునేలా గిట్టుబాటు ధర కల్పిం చే చట్టం తేవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు.  

ప్రత్యామ్నాయం కోసమే బీఎల్‌ఎఫ్‌: తమ్మినేని 
కేంద్ర ప్రైవేటీకరణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోందని, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న నష్టాన్ని కూడా ప్రశ్నించలేని దుస్థితిలో కేసీఆర్‌ ఉన్నారని తమ్మి నేని విమర్శించారు. వచ్చేనెల 4 నుంచి 7 వరకు నల్లగొండలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఏర్పాటైందని అన్నారు. బీజేపీతో, మరోవైపు ఎంఐంఎతో దోస్తీ చేస్తూ సీఎం కేసీఆర్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు