లాక్‌డౌన్‌: విమానంలో ఎలా వెళ్లారు?

24 Apr, 2020 18:35 IST|Sakshi
ప్రశాంత్‌ కిశోర్‌

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కోల్‌కతా వెళ్లారా, లేదా అనే దానిపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో కార్గో విమానంలో ఆయన కోల్‌కతా వెళ్లినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విచారణ సాగుతోంది. 

‘మేము విచారణ ప్రారంభించాం. లాక్‌డౌన్‌ ఆదేశాలను ధిక్కరించి ప్రశాంత్‌ కిశోర్‌ విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నించారా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నాం. దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అన్ని విమానాశ్రయాలను కోరామ’ని పౌర విమానయాన శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కోల్‌కతాకు కార్గో విమానాలు నడుపుతున్న విమానయాన సంస్థలను ఈ వ్యవహారం గురించి ప్రశ్నించగా  తమకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పినట్టు తెలిపారు. 

అయితే తాను కార్గో విమానంలో కోల్‌కతా వెళ్లినట్టు వచ్చిన వార్తలను ప్రశాంత్‌ కిశోర్‌ తోసిపుచ్చారు. మార్చి 19 తర్వాత తాను ఏ విమానాశ్రయానికి వెళ్లలేదని.. దీనికి విరుద్ధంగా ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే ఆ వివరాలను బహిర్గతం చేయాలని సవాల్‌ విసిరారు. కాగా, బెంగాల్‌ సర్కారుతో వరుస సమావేశాల తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ మార్చి 19న కోల్‌కతా నుంచి వెళ్లిపోయినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలు, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కార్గో విమానాలు తిరిగేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు 347 కార్గో విమానాలు తిరుగుతున్నాయి. 

చదవండి: కరోనా పోరులో రాజకీయ కొట్లాట

మరిన్ని వార్తలు