గవర్నర్‌ నోట ‘హోదా’ మాట.. విస్మయం!

6 Mar, 2018 12:32 IST|Sakshi

గత ఏడాది ప్యాకేజీ మాట వినిపించిన గవర్నర్‌

హోదాకు సమానంగా ప్యాకేజీ అంటూ వ్యాఖ్య

ఈ ఏడాది మారిన గవర్నర్‌ స్వరం

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ద్వంద్వ ప్రమాణాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో మళ్లీ మాట మార్చింది. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవాల్సిందేనంటూ గవర్నర్‌తో పలికించింది. నాడు ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీ మాత్రమే వస్తుందని గవర్నర్‌తో సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా చెప్పించిన ప్రభుత్వమే.. నేడు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా హోదా ఇవ్వాల్సిందేనని పలికించింది. చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వప్రమాణాలకు అద్దం పట్టేలా గవర్నర్‌ ప్రసంగం ఉండటంతో రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నాడు...
ప్రత్యేక కేటగిరి హోదా కింద లభించేవన్నీ సహాయంగా రాష్ట్రానికి లభిస్తాయి. పేరు మాత్రమే ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ అంటారు. దీన్ని సాధించడంలో రాష్ట్ర చేసిన కృషి ఫలించింది. దీనికి చట్టబద్ధత కోసం కృషి చేస్తాం. హోదా కింద రాష్ట్రానికి చేకూరే మద్దతు, రాయితీలు ఇతర సహాయాలన్నీ ప్రత్యేక సాయంలో భాగంగా ఉంటాయని కేంద్రం హామీ ఇచ్చింది
- 2017 మార్చి 6న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్‌

నేడు...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లో పేర్కొన్న హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలి. జాతీయ సంస్థల ఏర్పాటుతో పాటు హామీలన్నింటినీ సత్వరం అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చే వరకూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించాలి
2018 మార్చి 5న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్‌

నాడు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయాన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో చెప్పకనే చెప్పేశారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీ వల్ల కూడా వస్తాయంటూ చంద్రబాబు మాటలనే వల్లేవేశారు. కానీ ఏడాది తిరిగేసరికి ప్యాకేజీ ఉత్త బూటకమని తేలిపోయింది. చంద్రబాబు సర్కారు కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ, అటు పార్లమెంటులోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఢిల్లీలో గర్జించి... మహాధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో హోదా సాధించాలన్న ప్రజల ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా గవర్నర్‌ సోమవారం ప్రసంగంలో సైతం ప్రత్యేక హోదా ప్రస్తావన రావడం గమనార్హం.

నాడు ప్యాకేజీ సాధించడంలో రాష్ట్రం కృషి ఫలించిందంటూ గవర్నర్‌ చేత గొప్పలు చెప్పించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు హోదా కోసం సాగుతున్న ప్రజాందోళనలకు, వైఎస్‌ఆర్‌సీపీ పోరాటానికి దిగివచ్చి.. కేంద్రం కచ్చితంగా రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని గవర్నర్‌తో చెప్పించడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. గతంలో ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్న సంగతి తెలిసిందే. నాడు గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్యాకేజీకి ఒప్పుకున్నామని, కానీ, హోదా కోసం ఇప్పటికీ కేంద్రాన్ని అడుగుతున్నామని చంద్రబాబు తాజాగా కొత్త నాటకానికి తెరతీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలకు గవర్నర్‌ ప్రసంగం అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు