ఆ సీల్డ్‌ కవర్‌లో ముఖ్య వివరాలే ఉండొచ్చు

29 Nov, 2018 02:34 IST|Sakshi

సచివాలయం మీడియా పాయింట్‌లో సీఈఓ రజత్‌ కుమార్‌

కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో సోదాలపై నివేదిక అందింది

ఇప్పటివరకు సీజ్‌ అయిన వాటి విలువ రూ.104.41 కోట్లు

పార్టీలకు నకిలీ ఓటర్ల జాబితాలు.. 2లోపు ఓటరు స్లిప్పుల పంపిణీ

19 లక్షల కొత్త ఓటర్లు నమోదు.. అందులో 7.5 లక్షలు టీనేజ్‌ వారే

ఈసీ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌పై చర్యలు తీసుకుంటాం

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ నుంచి ఒక సీల్డ్‌ కవర్‌ నివేదిక అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ వెల్లడించారు. అయితే అందులో ఏముందో తానింకా చూడలేదని, దీనిపై వివరాలు మీడియాకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘సీల్డ్‌ కవర్‌ వచ్చింది కాబట్టి అందులో ఏదో ముఖ్యమైన వివరాలే ఉండొచ్చు. లేకుంటే సీల్డ్‌ కవర్‌ ఎందుకొస్తుంది..’అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద బుధవారం రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.  

మొత్తం సీజ్‌ విలువ రూ.104.41 కోట్లు.. 
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటున్నారని వాటిని గుర్తించి ధ్వంసం చేయాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు మద్యం పంపిణీ యోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని, దీనిపై ఎక్సైజ్‌ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పటివరకు నగదు, మద్యం, గంజాయి సహా మొత్తం సీజ్‌ విలువ రూ.104.41 కోట్లకు చేరిందన్నారు. అందులో నగదు రూ.87.98 కోట్లు ఉందన్నారు. మద్యం విలువ రూ.8.86 కోట్లుగా పేర్కొన్నారు. సీజ్‌ చేసిన నగదులో రాజకీయ పార్టీలవి కొంత మొత్తమే ఉన్నట్లు నిర్ధారించామని, అందులో అధికార పార్టీ నుంచే అధికంగా ఉందన్నారు. పట్టుబడిన వాటిలో కొందరు ఆధారాలు చూపించి, నగదును వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే కొంత సొమ్ము మూలాలు తెలియడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో కొన్ని చోట్ల నక్సలైట్లు, ఇతరత్రా సమస్యలున్నందున ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు.  

అధికారులు, పార్టీలకు ఆ జాబితాలు 
నకిలీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించకుండా అబ్సెన్టి, షిప్టెడ్, డూప్లికెట్‌ కింద ఒక జాబితాను తయారు చేసి పోలింగ్‌ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందివ్వనున్నట్లు సీఈఓ చెప్పారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పోటీలో ఉన్నారనే అభ్యర్థుల జాబితాను సీఈవో వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఈసీ నిబంధనలకు అనుగుణంగా పాస్‌ఫొటోలు సమర్పించనందునే కొంత ఆలస్యమైందని చెప్పారు. పెరిగిన అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలట్‌ యూనిట్లు (బీయూ) 4,570 బెంగళూరు నుంచి వస్తున్నాయన్నారు. అభ్యర్థుల వారీగా బీయూలో మీటలను సెట్‌ చేస్తామన్నారు. ఈవీఎం బ్యాలెట్‌ ముద్రణ కూడా పూర్తవుతుందన్నారు. వచ్చే ఒకటో తేదీ వరకు ఈ ప్రకియను ముగిస్తామన్నారు. 

మంత్రి హరీశ్‌పై చర్యలు తీసుకుంటాం 
ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావుపై ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్‌ 125 ప్రకారం చర్యలు తీసుకుంటామని రజత్‌కుమార్‌ చెప్పారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకే పార్టీకి హోర్డింగ్స్‌కి అవకాశం కల్పిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని, అయితే అందరికీ అవకాశమివ్వాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.  

మీడియాకు స్వేచ్ఛ ఉంది 
మీడియాకు స్వేచ్ఛ ఉందని, కొన్ని విషయాల్లో నియంత్రించడం సరికాదని రజత్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉందని, అయితే సర్వే చేసుకుని ఎవరికెన్ని సీట్లు అనేది మాత్రం పబ్లిష్‌ చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపై మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు. దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లపై ఈసీ నుంచి వచ్చిన యాక్సెసబుల్‌ అబ్జర్వర్స్‌ సంతృప్తి వ్యక్తం చేశారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని కితాబిచ్చారన్నారు. గోషామహల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మిస్సింగ్‌పై పోలీసుల నుంచి నివేదిక కోరామని తెలిపారు.

ఓటర్లు స్లిప్పుల వెనుక గూగుల్‌ మ్యాప్‌
ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలైందని, వాటి వెనక భాగంలో పోలింగ్‌ కేంద్రానికి దారిచూపే గూగుల్‌ మ్యాప్‌ కూడా ఉంటుందని సీఈఓ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వచ్చే నెల 2 వరకు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే అంతకంటే ముందే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొత్తం నమోదైన 2.80 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో దాదాపు 7.5 లక్షల మంది ఓటర్లు 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారేనన్నారు. బూత్‌ లెవెల్‌ స్థాయి అధికారులపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియ సంతృప్తికరంగానే ముగిసిందని చెప్పారు.

మరిన్ని వార్తలు