ఏపీ హోంగార్డులు వద్దు!

30 Oct, 2018 02:44 IST|Sakshi

ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది: సీఈవో

ఏపీ మినహా పొరుగు రాష్ట్రాల నుంచి 25 వేల మంది హోంగార్డులు

ఏపీ ఇంటెలిజెన్స్‌ నుంచి ఇంకా వివరణ అందలేదు  

కేంద్రం నుంచి 53 మంది పరిశీలకుల రాక

ఏర్పాట్లపై సీఈవో రజత్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీ మినహా మిగిలిన ఐదు పొరుగు రాష్ట్రాల నుంచి 25 వేల మంది హోం గార్డులను రప్పిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. తెలుగు మాట్లాడే ఏపీ హోంగార్డులను నియమిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో సర్వేలు జరుపుతూ ఇటీవల పట్టుబడ్డ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి 5 వేల మంది చొప్పున ఎన్నికల బందోబస్తుకు పంపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు సీఈవో వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ జోక్యంపై ఆ రాష్ట్ర డీజీపీ నుంచి వివరణ కోరినా ఇంకా అందలేదన్నారు. డీజీపీ వివరణ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అభ్యర్థుల వ్యయంపై పక్కా లెక్కలు
అభ్యర్థుల ఎన్నికల వ్యయం గరిష్టంగా రూ.28 లక్షలకు లోబడి ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏ ఒక్కరూ కూడా రూ.28 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపలేదని రజత్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థులు వ్యయాన్ని తగ్గించి చూపుతున్నారని, డమ్మీ అభ్యర్థులతో పోటీ చేయించి తమ ఎన్నికల వ్యయంలో కొంత భాగాన్ని వారి ఖాతాల్లోకి వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డమ్మీ అభ్యర్థుల పేరుతో వాహనాలు, ఇతర వనరుల వినియోగానికి అనుమతులు పొంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు తమ పరిశీలనకు వచ్చిందన్నారు.

అభ్యర్థుల ఖర్చులకు పక్కా ఆడిటింగ్‌ జరుగుతుందని, ప్రతి పనికి ప్రామాణిక ధరలతో వ్యయాన్ని లెక్కించి వారి ఖర్చుల ఖాతాలో జమ చేస్తామన్నారు. జాతీయ పార్టీలకు 40 మంది, ప్రాంతీయ పార్టీలకు 20 మంది చొప్పున స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతిస్తామన్నారు. వీరి ప్రచార ఖర్చు మొత్తాన్ని సదరు రాష్ట్ర పార్టీ కమిటీ ఖాతాలోకి వెళ్తుందని, అభ్యర్థి చేసే ప్రచార ఖర్చు మాత్రం అభ్యర్థి ఖాతాలోకి వస్తుందన్నారు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 53 మంది సాధారణ పరిశీలకులు, 68 మంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిశీలకులు, 10 మంది పోలీస్‌ పరిశీలకులు రానున్నారని రజత్‌కుమార్‌ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్‌ విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి అత్యవసర వైద్య సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఎయిర్‌ అంబులెన్స్‌ల సంఖ్యపై అధ్యయనం జరుపుతున్నామన్నారు. గత ఎన్నికల్లో ఒక ఎయిర్‌ అంబులెన్స్‌ను ఖమ్మం జిల్లాలో వినియోగించినట్లు చెప్పారు.  

శాంతిభద్రతలు బాగు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని రజత్‌కుమార్‌ తెలిపారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల కంటే శాంతిభద్రతలు తెలంగాణలో బాగున్నాయన్నారు. ఇప్పటికే నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని బైండోవర్‌ చేస్తున్నామని వివరించారు. నాన్‌బెయిలబుల్‌ వారంట్లున్న వారిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఓటర్లలో మనోధైర్యం నింపేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌లను నిర్వహిస్తున్నామన్నారు.

కేంద్రం నుంచి 307 కంపెనీల బలగాలను కోరగా, 250 కంపెనీల బలగాలను మోహరించేందుకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 70 వేల మంది బలగాలతో పాటు, అదనంగా 25 వేల మంది హోంగార్డులతో పోలింగ్‌ రోజు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.26.73 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో తెలిపారు. 10,600 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని, దీని విలువ రూ.35 లక్షల వరకు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు