ముందు మనమే మారాలి

17 Nov, 2018 01:58 IST|Sakshi

మీట్‌ ది ప్రెస్‌లో సీఈవో రజత్‌ కుమార్‌

అప్పుడే ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకోగలం

ప్రజలు ఓటేస్తేనే నేతల పిల్లలు ప్రజాప్రతినిధులవుతున్నారు

ఎన్నికల సంఘంపై రాజకీయ ఒత్తిళ్లు లేవు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకోవాలంటే మనలో మార్పు రావాలి. సామాజిక మార్పుతోనే ఇది సాధ్యమవుతుంది. డబ్బు తీసుకునే ఓట్లేస్తారని చాలా మంది అంటున్నారు. కానీ డబ్బు తీసుకున్న ఓటరు కచ్చితంగా ఆ అభ్యర్థికి ఓటేస్తారని అనుకుంటే పొరపాటు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల నుంచి కూడా డబ్బు తీసుకుని తనకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తాడు. ఇలా డబ్బు తీసుకునే వాళ్లు చాలా తక్కువ.

ఇది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది’అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు తక్కువగానే ఉందన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 86 కోట్లు సీజ్‌ చేశామని... అదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ. 800 కోట్లకుపైగా నగదును సీజ్‌ చేశారని గుర్తుచేశారు.

వారసులను ప్రజలే ఎన్నుకుంటున్నారు
రాజకీయ నాయకుల పిల్లలు నేరుగా పదవులు చేపట్టడం లేదని, లక్షల మంది ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులవుతున్నారని రజత్‌ కుమార్‌ గుర్తుచేశారు. ప్రజలు కోరుకున్న వ్యక్తే నాయకుడవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం సాధ్యమని, అయితే ఇందులో కోరుకుంటున్న మార్పులు ఒక్కరోజుతో అయ్యేవి కావని, కానీ క్రమంగా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.

అభ్యర్థుల వాస్తవ ఆదాయం, అఫిడవిట్లలో చూపుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదన్న విమర్శలపై స్పందిస్తూ అభ్యర్థులు సమర్పించిన లెక్కలను పరిగణిస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని రజత్‌ కుమార్‌ సూచించారు. ఎన్నికల సంఘం పరిమితులకు లోబడి పనిచేస్తుందని, నిబంధనల మేరకే నడుచుకుంటుందని, ఇందులో కొత్తగా తీసుకునే నిర్ణయాలుండవన్నారు.

ఎన్నికల సంఘంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, తాను పనిచేసిన కాలంలో ఇప్పటివరకు రాజకీయ ఒత్తిళ్లకు గురికాలేదని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే ఎవరినీ ఉపేక్షించబోమని, అధికార పార్టీని ఒకలా, ప్రతిపక్ష పార్టీలను ఇంకోలా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎన్నారైల ఓటు నమోదుకు అవకాశం ఇచ్చామని, తక్కువ మంది నమోదు చేసుకున్నారని, వారికి ఓటేసే అవకాశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.


పోలింగ్‌ రోజు సెలవు ఇవ్వకపోవడం నేరమే
పోలింగ్‌ రోజు వ్యాపార, వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అకారి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ లైవ్‌ ఉందని, వెబ్‌కాస్టింగ్‌ సర్వీసు లేని ప్రాంతాల్లో రికార్డింగ్‌ చేస్తామని పేర్కొన్నారు.

పోలింగ్‌ సిబ్బంది కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ 55 శాతం మించడం లేదని, ఈసారి యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఆయన  వివరించారు. గతంలో కంటే ఈసారి 120 శాతం అధికంగా యువత ఓటు హక్కు నమోదు కోసం ముందుకొచ్చారని రజత్‌ కుమార్‌ వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి గండ్ర నవీన్, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు