హస్తంతోనే సైకిల్‌ సవారీ!

24 Jan, 2019 02:41 IST|Sakshi

పెళ్లి సాకుతో బాబు ఢిల్లీ పర్యటన

బీజేపీయేతర పక్షాలతో భేటీ అని లీకులు

కాంగ్రెస్‌ అధ్యక్షుడితో మాట్లాడి వచ్చేసిన ముఖ్యమంత్రి

రాయలసీమ, దక్షిణ కోస్తాలలో ఓట్లు చీల్చడమే లక్ష్యం

అభ్యర్థులను డిసైడ్‌ చేసేది బాబే..

ఖర్చులు టీడీపీ ఖాతాలోంచే..

జనసేనతో ‘ప్రత్యక్ష పొత్తు’కు కసరత్తు

కుదరకపోతే కాంగ్రెస్‌ తరహా అవగాహనకు సిద్ధం

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోలబ్ధి పొందడమే లక్ష్యం..

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తుల ఎత్తుగడలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేసే కన్నా పరోక్షంగా సహకరించుకోవడమే మేలన్న అవగాహనకు ఈ రెండు పార్టీలూ వచ్చాయి. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లిన సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అన్నీ వివరించి ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ఆ వెంటనే రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు హుటాహుటిన అమరావతికి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ఎంచుకున్న స్క్రిప్ట్‌ను పొల్లుపోకుండా వల్లెవేసి వెళ్లిపోయారు. తాము ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఇంత అర్ధాంతరంగా ఊమెన్‌ చాందీ స్పష్టం చేయాల్సిన అవసరమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. అందులోనూ రాహుల్‌ గాంధీని చంద్రబాబు కలసి మంతనాలాడిన మర్నాడే ఈ ప్రకటన దేనికో అర్ధం కాలేదు. కానీ పరోక్ష పొత్తు గనుక ఇక ఆలస్యం చేయకూడదని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నందుకే ఈ హడావిడి ప్రకటన వెలువడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

హస్తంతో పరోక్ష పొత్తు ఎందుకంటే..
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యే పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అసలు ఉద్దేశం వేరే ఉంది. రాహుల్‌ గాంధీతో చర్చలు జరిపి అవగాహనను ఓ కొలిక్కి తెచ్చుకోవడానికే తన ఢిల్లీ పర్యటనను చంద్రబాబు ఉపయోగించుకున్నారు. పెళ్లికి వెళ్లిన చంద్రబాబు మరుసటి రోజు కూడా అక్కడే ఉండబోతున్నారని, బీజేపీయేతర పార్టీల నాయకులతో సమావేశమవుతారని ముందుగా మీడియాకు లీకులిచ్చారు. కానీ పెళ్లికి వెళ్లిన చంద్రబాబు ఢిల్లీలో ఉండలేదు. బీజేపీయేతర పార్టీలను కలిసే ఉద్దేశమే ఆయనకు లేదు. అనుకున్నట్లుగా రాహుల్‌ గాంధీని కలసి అనుకున్నవన్నీ మాట్లాడుకుని ఆయన తిరుగుముఖం పట్టారు. పెళ్లి ఒక సాకు మాత్రమేనని, రాహుల్‌ గాంధీని కలవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చునని విశ్లేషకులంటున్నారు. తెలంగాణలో తల బొప్పికట్టిన దరిమిలా రాష్ట్రంలో పరిస్థితులన్నీ మదింపు వేసిన తర్వాత పొత్తుల విషయమై చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని, కాంగ్రెస్‌ ఓట్లు తమకు బదిలీ కావడం అంత తేలికైన పనికాదని అర్ధం చేసుకున్నారని అంటున్నారు. అందుకని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలను ఆయన ఎంచుకున్నారు. అందులో 25 నుంచి 35 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ తరఫున గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. వారిని చంద్రబాబే నిర్ణయిస్తారని, వారి ఎన్నికల ఖర్చును కూడా ఆయనే ఇస్తారని అంటున్నారు. తద్వారా ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వెళ్లే ఓట్లను వీలైనంత ఎక్కువగా చీల్చాలన్నది వీరి ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇదే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన రహస్య అవగాహన సారాంశం. 

జనసేనతో పొత్తు కూడా అనుకున్నట్లుగానే..
ఇక ఉత్తరాంధ్ర,  కోస్తాంధ్రల విషయానికొస్తే జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్నది తెలుగుదేశం ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇటీవలే అమెరికా పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అక్కడ చంద్రబాబు సన్నిహితుడు లింగమనేని రమేశ్‌ను కలుసుకున్నారని, అనేక విషయాలపై చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉభయ పార్టీల మధ్య పరస్పర సహకారం విషయమై విడతలవారీగా పలుమార్లు చర్చలు జరిగినట్లు కూడా తెలుగుదేశం, జనసేన వర్గాలలో వినబడుతున్నది. ‘చంద్రబాబుగారిపై కక్షసాధించడానికే వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలుస్తున్నాయి’ అన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్య గానీ, ‘పవన్‌ మనోడే ఆయనను ఏమీ అనవద్దు’ అని పార్టీ నాయకులకు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు గానీ ఇరు పార్టీల మధ్య అవగాహన ఏ స్ధాయిలో ఉందో తెలియజేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ధారిస్తున్నట్లుగా బుధవారం నాడు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీ మధ్యే పొత్తు కుదిరినప్పుడు జనసేన – తెలుగుదేశం కలిస్తే తప్పేమిటి అని ఆయన ప్రశ్నించారు.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై మార్చిలో చర్చలు జరుగుతాయని కూడా టీజీ తేల్చి చెప్పడం మీడియాలో హల్‌చల్‌ చేసింది. పొత్తుల విషయం ముందే బయటకు పొక్కడం ఎందుకనుకున్నారో ఏమో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దీనిపై కాస్త ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ఖండించడం కాకుండా టీజీ వెంకటేష్‌పై పవన్‌ వ్యక్తిగత విమర్శలకు దిగడం చూసి అందరూ విస్తుపోయారు. అయితే రెండు పార్టీల మధ్య ఏదో రకంగా పొత్తు కొనసాగే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు వినిపిస్తోంది. అందుకనే ప్రత్యక్షంగా పొత్తుపెట్టుకున్నా లేదా పరోక్షంగా సహకరించుకున్నా  జనసేన ఎన్నికల ఖర్చులు భరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.  

మరిన్ని వార్తలు