ఆపద్ధర్మ కాదు.. అధర్మ ప్రభుత్వం: చాడ

15 Sep, 2018 03:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభద్రత, నిరాశ నిస్పృహలతో నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన ఆపద్ధర్మ ప్రభుత్వంగా కాకుండా అధర్మ ప్రభుత్వంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా విద్యా విధానంలో మార్పులు రావాలని కోరుతూ శాంతియుతంగా ప్రచారం చేయడానికి ప్రారంభం కానున్న బస్సును అడ్డుకుని, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ చొక్కాను చింపి, కళ్లద్దాలను పగులగొట్టి అరెస్టు చేయడం ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని విమర్శించారు.

బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా ప్రొఫె సర్లు హరగోపాల్, చక్రధర్‌రావు, లక్ష్మీనారాయణ, ఇతర ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం కేసీఆర్‌ దివాళాకోరుతనానికి పరాకాష్ట అని చాడ మండిపడ్డారు. కొన్ని రోజుల్లో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే భయంతో తప్పులమీద తప్పులు చేస్తున్న కేసీఆర్‌కు నూరుతప్పులు చేసిన శిశుపాలుడికి పట్టిన గతి తప్పదని ఆయన హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు