సెంటిమెంట్‌ ముందు నిలవలేకపోయాం

13 Dec, 2018 02:37 IST|Sakshi

కూటమి సమన్వయం సరిగా కుదరలేదు

బలోపేతం కావడం ద్వారా కేసీఆర్‌ విధానాలకు చెక్‌: చాడ 

సాక్షి,హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెంటిమెంట్‌ రాజకీయాల ముందు ప్రజా కూటమి నిలవలేకపోయిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విశ్లేషించారు. కూటమి ఎజెండా బాగా ఉన్నా, వాటిలోని అంశాలను కేసీఆర్‌ మొదట విమర్శించినా ఆ తర్వాత పెన్షన్లు, నిరుద్యోగ భృతికి మరో రూ.16 కలిపి టీఆర్‌ఎస్‌ తమ వాగ్దానాలనే కాపీ కొట్టిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ప్రచారంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను టీఆర్‌ఎస్‌ తెరమీదకు తీసుకొచ్చిందని, దీంతో సెటిలర్లంతా టీఆర్‌ఎస్‌ పక్షానే నిలిచారన్నారు. మఖ్దూంభవన్‌లో బుధవారం ఆ పార్టీ నాయకులకు అజీజ్‌ పాషా, పల్లా వెంకటరెడ్డి లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలకు వామపక్షాలకు ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు. 

సీట్ల సర్దుబాటులో జాప్యమే ముంచింది
కూటమి సరైన సమయంలో ఏర్పడినా, సీట్ల సర్దుబాటులో జాప్యం, సమన్వయలోపాల కారణంగా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఖమ్మం జిల్లా మాత్రమే ప్రజాకూటమికి అండగా నిలిచిందని, మిగతా జిల్లాల్లో భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కుదరలేదన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు సగానికి సగం సీట్లు తగ్గుతాయని తాము అంచనా వేసినా సెంటిమెంట్‌ రాజకీయాలతోనే కేసీఆర్‌ విజయం సాధించారన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయన్నారు.

ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగిందని, వీటి నియంత్రణలో ఈసీ విఫలమైందన్నారు. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రజాకూటమి మరింత సమన్వయంతో బలోపేతం కావడం ద్వారా కేసీఆర్‌ ఏకపక్ష విధానాలకు చెక్‌ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కలిసి పోటీచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని, తాము కాంగ్రెస్‌ కూట మిలో, బీఎల్‌ఎఫ్‌ కూటమిలో సీపీఎం పోటీచేశాయన్నారు. సీపీఐకు ఇచ్చిన 3 సీట్లలో మిత్రధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు